పుట:Gurujadalu.pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంగణంలో దక్షిణం వేపు సామాజికులకు యెదురుగా వొక మంటపం యేర్పరిచారు. ఆ మంటపం మీద ముందుకు రెండు యెజ్జగాజు దీపపుచెట్ల నడుమను రవీంద్రుడూ, వొక పండితుడూ, ధోవతి అంగ వస్త్రములతో కూచున్నారు. వారి యిరుప్రక్కలనూ, వెనకకూ సామా జికులలో పేరుపడ్డ వారూ, గాయకులూ కూచున్నారు. వారిలో పండిత శివనాథ శాస్త్రిగారినీ, హేరంబచంద్రమిత్రగారినీ పోల్చగలిగితిని. నేను వెళ్ళేసరికి రవీంద్రులు మేఘ గర్జనమును పోలిన కంఠంతో భగవంతుణ్ణి కొని యాడుతుండెను. సామాజికులకు జ్ఞానోపదేశము చేస్తుండెను. మధ్య మధ్యను రవీంద్రుడూ, గాయకులూ భక్తి పారవశ్యం పుట్టేటట్టు కీర్తనలను పాడుతూ వచ్చిరి. అప్పుడప్పుడు మెరుపు దీపాలు గప్పుగప్పున ఆరి వెలుగుతూ వచ్చినవి. అలా ఆరినప్పుడు భవనం మీద రాలిన చీకటి యొక్క రెక్కలమీద భగవంతుడు సన్నిహితుడయినట్టు మనస్సుకు తోచేది. కాదా? చీకటే వెలుతురు. మరుపే జ్ఞానము. చిన్ననాటి మాట యేమో, యిప్పుడు రవీంద్రుడుత్కృష్టమైన బతుకు బతుకుతున్నాడు. శాంతుడు, భక్తుడు, దయాపరుడు, పరోపకారమే బతుకునకు వినియోగమని నమ్మినవాడు, మంచివాడు. ఇట్టి మహాత్ములు వుండబట్టే బంగాళా బాగై వన్నెకెక్కింది. బ్రహ్మమతం బంగాళాకు చాలా మేలు చేసింది. కొందరికైనా స్త్రీలకు చెరవొదల్చింది. బంగాళాకూ, సీమకూ బాట వేసింది. ఆ సుందరులు దీపమువలే దేశమునకు వెలుతురు నిస్తు న్నారు. ఆ బాటను సీమనుండి నాగరికత ఆ దేశానకు దిగబడ్డది. రవీంద్రుని వాజ్మాధుర్యంను క్రోలి క్రోలి, ఉత్సవం ముగిసే వరకు వుంటే, తొడిదొక్కిడి లావగునని యెంచి, నా మిత్రులను వీడ్కొని చీత్పూరు రోడ్డుకు వచ్చితిని. అక్కడ అంతకంటే తొడిదొక్కిడి కానవచ్చింది. ఆ రోజు మాఘ పంచమి. బంగాళీలు సరస్వతీ పూజ చేస్తారు. రాత్రి ఉత్సవంలో సరస్వతీ ప్రతిమల్ని ఊరేగిస్తారు. ఆ పట్నంలో సామంతులు యిసకపాతర. ప్రతి సామంతుడూ తన యింట సరస్వతిని నిలిపి వూరేగిస్తాడు. ముచ్చిపనితో ధగధగలాడే వాహనాల తోటి, రథాల తోటి జన ప్రవాహం ఆ వీధిలో అడ్డు కలిగిన నీటి ప్రవాహం వలె పొంగి వెనకాడుతూ, కొంత సాగుతూ యెడతెగక కనబడినది. ఉపాధికల ప్రతి బంగాళీ యింట్లోనూ, మొదటి అంగణంలో రమ్యమైన పూజామందిరం వుంటుంది. కాళీ, సరస్వతీ మొదలైన దేవతల వుత్సవములు ఆ మందిరంలో విశేషమైన వైభవంతో చేస్తారు. ఆ పూజలు ఆబాల వృద్ధులకు, స్త్రీ, పురుషులకు యింటిలిపాదికీ పనులు కల్పిస్తవి. మందిరమును అలంకరించడం, పూజా ద్రవ్యములను సమకూర్చడం స్త్రీ బాలుల వేడుక. యీ రీతిని యింటిలిపాదీ కలిసి చేసే పూజలు మనదేశంలో తక్కువ. నలుగురికీ గురుజాడలు యిద్దరు రాజులు 601