పుట:Gurujadalu.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నేర్చవలసిన అవసరం లేకుండా నిజాయితీ నాకు పుట్టుకతోనే వచ్చింది" అన్నాను.

"అయితే పుట్టకతో పుట్టిన ఆ నిజాయితీ చూదాం, చెప్పు నా పెళ్ళాం అందంగా వుందా లేదా?"

"ఆమె అందంగానే వున్నాదనుకుంటాను"

"సంశయవేవైనా వున్నదా?"

"లేదు"

"తోవంట వెళ్ళేటప్పుడు రోజూ, దానికోసం యీ వేపు చూస్తు వుంటావా లేదా?"

"నిజమాడమన్నారు గనుక వొప్పుకోక విధి లేదు. చూస్తున్నానుగాని, చెడ్డ తలపు మనసులో యీషత్తు వుంటే దేవుడు సాక్షి?"

"దాని మాటకేం - అది కంటిక్కనపడితే నీకు ఆనందం అవునా కాదా? నిజవన్నదేదీ?"

"అవును"

"అయితే ఈ ముండని తీసుకుపో - నీకు దానం చేశాను తీసుకో, నాకు శని విరగడై పోతుంది".

నేను మాటడకుండా కదలి పైకొచ్చాను. యిళ్ళు కనపడలేదు. మనుషులు కనపడలేదు. శృంగభంగమై నన్ను నేను దూషించుకుంటూ బరికి పోయినాను.

అక్కడ బస యెత్తెయడానికి నిశ్చయించాను. బస యెత్తేసి మరి ఆ వీధి మొహం చూడకూడదనుకున్నాను.

నా కళ్ళకి కట్టినట్లు ఆ వొంచిన మొఖం. బిందువులుగా స్రవించిన కన్నీరు. కాచుకొన్న నిట్టూర్పుల చేత కంపించిన రొమ్ము - యే మహాకవి రచనలోనూ లేదనగలను, అగాధమై ప్రౌఢమైన కరుణ రసం ఆ సరిలేని సొగసున్ను.


4

నే బసవున్న యింటి గుమ్మం దగ్గిరకి వచ్చేసరికి పులి యింటి ముసలి బ్రాహ్మణుడు సన్నసన్నగా నా చేతులో ఒక చీటి పెట్టి జారిపోయినాడు. ఇందాకటి కథతో దీనికేదో సంబంధం ఉందని తలచి నా గదిలోనికి వెళ్ళి లోపల గడియ వేసుకొని చీటి చదువుకొన్నాను. దానిలో యేముందీ?

కుదురైన అక్షరాలతో

"మీరు మీ నేస్తులూ నా కాపరం మన్ననివ్వరా? మీకు నేనేం అపకారం చేశాను? తల వంచుకు మీ తోవను మీరు పోతే నే బతుకుతాను. లేకపోతే నా ప్రారబ్ధం".