పుట:Gurujadalu.pdf/594

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


3

ఒకనాడు అభ్యంగనమై జుత్తు విరయబోసి, షోకుగా టోపీ తలనమర్చి, మల్లిపువ్వు లాంటి బట్టలు కట్టి బరికి పోతూ, మెటిల్డా యింటి యెదట జాలంగా నడుస్తూ వుంటిని. అంతట గుమ్మం దగ్గిరికి వచ్చి ఆమె వైపు చూస్తూ నిలిచిపోయినాను. అర మినుటు కావచ్చు, పులి గుహలోంచి పైకి దుమికి అబ్బాయీ యిలారా అన్నాడు. తంతాడేమో పరుగుచ్చుకుందాము అనుకున్నాను. గాని అట్టి పని చేస్తే నాయందు నేరం నిలవడం కాకుండా మెటిల్డా యందు నేరం నిలుస్తుందేమో? నాకు యేమైతే ఆయను, ఆమెను కాపాడదామని వెళ్ళాను.

లైబ్రరీ గదిలోకి తీసికెళ్ళాడు. కుర్చీ మీద కూలబడి రౌద్రాకారమైన చూపుతో యింగ్లీషున అడిగాడు?

నా పెళ్ళాం వైపు చూస్తున్నావా?

కిటికీ లోంచి కనపడుతూండే మీ లైబ్రరీ చూస్తు మీరు యెటువంటి మనుష్యులు, యేమి చేస్తుంటారు అని ఆలోచిస్తున్నాను

నా పెళ్ళాన్ని చూడలేదూ?

చూశాను. యెదట నిలుచుంటే కనపడరా, అంతే పిడుగులాగ 'ఔనే! ఔనే!' అని పిలిచాడు. మెటిల్డా రాలేదు.

"వొస్తావా రావా లంజా!" అన్నాడు. వొణుకుతూ మెల్లగా వచ్చి తల వొంచుకు నిలబడ్డది.

యింగిలీషున నాతో మళ్ళీ అన్నాడు.

ఓ తెలివి తక్కువ దద్దమ్మా - చూడు యెంత సేపు చూస్తావో. యీ ముండ మొహం వేపు యేం, నా వేపు చూస్తావేం, దాని వేపు చూడక? నా మొహం దాని మొహం కన్నా బాగుందనా?

నేను మాట్లాడలేదు. కథ బాగుంది కాదని, కాలు గుమ్మం వేపు సాగించబోతూండగా, కనిపెట్టి మెల్లగా "వుండు" అన్నాడు.

నిలిచాను.

నిమిషం కిందట కన్నుల రాలిన నిప్పులు చల్లారాయి.

అబ్బాయీ అన్నాడు.

నిజవాడ్డం యెన్నడైనా నేర్చావా? తల్లిదండ్రుల దగ్గిర గాని గురువుల దగ్గిర గాని నా తల్లీ తండ్రీ తలపుకు వచ్చారు.