పుట:Gurujadalu.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యేమి చెయ్యను? అక్కడ బస విడిచి మరివక చోటికి పోతే, నా మట్టుకు చిక్కు వొదులు తుందనుకుంటిని గదా? యిప్పుడు మెటిల్డా చేసిన విన్నపం యెలా తొలగి వెళ్ళిపోదును? నా స్నేహితుల వల్ల ముప్పు కలక్కుండా ఆమెను కాపాడవద్దా? కాపాడగలనా?

మెటిల్డాను కాపాడలేకపోతే బతుకేమిటి? పౌరుషమేవిటి? ఈ మనోజ్ఞమైన స్త్రీ రత్నం యొక్క చిత్రకథలో దు:ఖ భాజన కథలో, నేను కూడా చేరానా? దు:ఖం మళ్ళింది. యీ అందకత్తె మనసుతో మెప్పుకొంటే జన్మసార్థకమవుతుంది. ఈ సొగసైన లిపి మెటిల్డా రాసినదా? యేమి అదృష్టవంతుణ్ణి? మెటిల్డా యేమి రాస్తే చెయ్యను. త్రైలోక రాజ్యం నాకుండి యిమ్ము అంటే పట్టం గట్టనా?

గాని యిప్పుడు యేం చేతును? నాకు లోకజ్ఞానం తక్కువ. వినాయకుని చెయ్యి బోయి కోతిని చేస్తానేమో? రామారావు అనుభవజ్ఞుడు, గుణవంతుడు, నేర్పరి, చెప్పిన మాట విననందుకు చివాట్లు పెడితే పడతాను. నా ఉద్యమంలో సాయం చెయ్యమని కాళ్ళు పట్టుకుంటాను.

అని ఆలోచించి రామారావుకు పూస గుచ్చినట్లు కథంతా చెప్పాను. నా నిశ్చయం యిదని తెలియచేశాను. మళ్ళించ ప్రయత్నించవొద్దని గెడ్డము పట్టుకు బతిమాలాను. రామారావన్నాడు. "మళ్ళించగలనని నమ్మకం వుంటే మళ్ళించజూతును, మళ్ళవని యెరుగుదును. చూడవద్దంటే చూడడం మానితివా?"

"గాని నాకు తోచిన మాటా, నాకు తెలిసిన మాటా నీకు చెప్పకపోతే నేను అపరాధిని అవుతాను, స్నేహాన్ని తప్పిన వాణ్ణి అవుతాను."

"ఆలు మొగుళ్ళ దెబ్బలాటల్లోకి వెళ్లవద్దని మన పెద్దల శాసనం. అవి అభేద్యాలు, అగమ్య గోచరాలు. మధ్యవర్తులు కాపరం చక్కచేదామని చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు" ఒకటి.

"పులి పులి అని మనం యెంత పేరు పెట్టినా పాపం యీ పులి అరుపే కాని కరువు లేదు. మెటిల్డాని యెన్నడైనా ఒక్క దెబ్బ కొట్టాడని విన్నామా? లేదు. తిండికి లోపం లేదు. గుడ్డకి లోపం లేదు. అతను చెప్పినట్టు మెసులుకుంటే నెమ్మదిగా కాలం వెళ్ళడానికి అభ్యంతరం లేదు" - రెండు

"యిక మూడోది. నీకు మెటిల్డా మీద మనస్సు గట్టిగా లగం అయింది. అది కూడని పని. చెడ్డ తలంపు లేనప్పుడు యేమి ఫర్వా అని అనగలవు. చెడ్డ తలంపు చెప్పి రాదు. యెక్కణ్ణించో రానక్కర్లేదు. కంటిక్కనపడకుండా మనసులో ప్రవేశించి పొంచి వుంటుంది. చూసీ చూడనట్టు మనం వూరుకొని అది పైకొచ్చే ప్రయత్నాలు బాహాటంగా చేస్తూ వుంటాం. చెడ్డ తలపులకి గుర్తు యెవరైనా వుండాలి కదూ. అడవిలో వొంటరిగా వున్న వారికి స్త్రీల విషయమై