పుట:Gurujadalu.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ది.రా : గిరీశం చెప్పడు. లోగిట్లో వాళ్లు ఆ సమయంలో వుంటేమట్టుకు ఆబోరుదక్కదు. వాళ్లు పుట్టింటికి పంపించమని సంవత్సరమై తొందర చేస్తున్నారు. ముహూర్తం లోగానేకుదిర్చి మీరు తీసుకుని వెళ్లి దిగబెట్టండి.

గంగా : మీరు విధవా వివాహములో కలుస్తే బహిష్కారం అవుతుందే.

ది.రా : యింతేనా నా మంత్రశక్తి శాస్తులు గారు. చూశారు బ్రహ్మసమాజ మత ప్రకారం పెళ్ళి అయితే మనం చేసే సహాయ సంపత్తి వల్ల బాధకం లేదు. పెళ్లి సమయంలో వెళ్లి Tiffin పుచ్చుకున్నా, కిరస్తానులు, తురకలు వద్ద పుచ్చుకున్నట్టే గాని అంతకన్న తప్పు పట్టడానికి అవకాశం లేదు. క్షీరం కలిసినందువల్ల కాఫ్యాదులు చెండాల హస్తంలో నుంచి ఆరగించవచ్చును.

గంగా : బోధపడ్డది.

(యిద్దరూ నిష్క్రమింతురు)


కొండుభొట్టీయము

తృతీయాంకము

తృతీయ రంగము

(కంసాలి దుకాణం)

(అక్కాభత్తుడు వెంకన్న ప్రవేశించును)

అక్కా : వెంకన్నా! పంతులు చెడిపోతున్నాడు. దాని శాష్టలు బహు అక్రమంగా వున్నాయి. మీ బాబు మంత్రాంగము వల్ల యవరు బాగుపడ్డారు?

వెంక : మా బాబు యేం చేశాడు?

అక్కా : యేం చెయ్యలేదు. సానిదాన్కి సరసుల్ని తార్చి సంపాదిస్తాడు. పంతులుకి రత్నం వంటి పతివ్రత అయ్ని భార్య వుండగా దీని మాయలలో దీంపేశాడు.

వెంక : పంతులుని మీరు బాగు చెయ్యరాదు!

అక్కా : మీ బాబు మంత్రాంగం మీద మన బుద్దు లెక్కవు. గాని పంతులు కంటి మసక వదలదాన్కి వక మందు చెప్పుతాను. చెయ్యి.

గురుజాడలు

512

కొండుభొట్టీయము