పుట:Gurujadalu.pdf/556

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



యెంచను. మూడవది మా వంటి వాళ్లం సంఘంలో వుండి మీ అభిప్రాయములను వ్యాపింపచేస్తే లాభం గాని - అంతా యేట్లో దిగితే లాభం లేదు. కొంతమంది మన వాళ్లని పించుకున్న వాళ్లం గట్టుమీద వుంటే మనకే లాభం.

గిరీ : దానిపేరు ఇంగ్లీషులో టైమ్ సెర్వింగు (Time serving) అంటారు.

ది.రా : (అది...) మంచి అభిప్రాయములకు చెడ్డపేరు మహా సులభంగా యిస్తారు.

గిరీ : వధూవరులను మా యింట్లో పెట్టనా?

ది.రా : (ఆత్మగతం) యితని యింట్లో పెడితే బట్ట బయలవుతుంది. నలుగురూ చేరి అంతా Credit కోసం దేవులాడితే మన Credit సన్నగిల్లుతుంది. (ప్రకాశం) మీ యిల్లు సత్రవు. అక్కడయేం చేసినా చిదంబర రహస్యం. ఈ వ్యవహారం మట్టుకు పెళ్లి పీటల మీద... లేదు. కుర్చీల మీద కూర్చునే వరకూ వధూవర్లు ఫలానీ వారనీ యెవరికిన్నీ తెలియకూడదు. బ్రహ్మసమాజ మతం ప్రకారం పెళ్ళి కావడమునకు ప్రయత్నం నేను చేసుకుంటాను. యేదో ఒక విధవా వివాహము సిద్ధమయినదని నాయుడు గారితో చెప్పుతాను, గాని పేర్లు చెప్పను. తెలిసినదా, బ్రహ్మ సమాజం, పద్దతి వల్ల మరవక వుపయోగం కనిపెట్టాను. శాస్త్ర ప్రకారం అయితే మంచి ముహూర్తం దాకా వితంతువుని దాచి వుంచడం దుర్లభం. యీ లోగా బంధువుల వల్ల చాలా తొందర కలుగుతుంది. బ్రహ్మసమాజం ప్రకారమయితే పిల్లవచ్చిన మర్నాడు సాయంత్రమే పెళ్ళి చేసి వేయవచ్చును. నాకు తోచిన సలహా యేమిటంటే మాబగీచాలో వధూవర్లును ఆ రాత్రి పెట్టి....

గిరీ : బాగుంది! రూపాయిలో?

ది.రా : యివిగో! అని.....

(పెట్టె తీసి రూపాయిలిచ్చును)

గిరీ : Thank you (అని నిష్క్రమించును)

గంగా : (ఆత్మగతం) గాడిద కొడుకు! యిన్నాళ్లు ఆశ్రయించాను. నాకు నెలకి యేడు రాళ్లు యిచ్చేటప్పటికి కళ్ల నీళ్లు పెడతాడు. ఈ వెధవ పెళ్లికి మూడు వందలు ఖర్చుపెడుతున్నాడు.

ది.రా : శాస్తులు గారు! యీ సంగతి మనవాళ్ళకి తెలియనీకండి. మీరు చెప్పాలి. నేను చెప్పాలి మరెవరూ చెప్పరు.

గంగా : “ఘటర్జాభిద్యతే మంత్రాని” అన్నాడు.

గురుజాడలు

511

కొండుభొట్టీయము