పుట:Gurujadalu.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శెట్టి : సిత్తం బాబు! పిశాచమంటే నాకు భయం. పోలీసోళ్లంటే నాకు భయం - మరెవ్వళికీ లచ్చపెట్టను. (శెట్టితిరిగి సాగి వెళ్లుతాడు. )

నరహరి: నిలబడు!

శెట్టి : (వెళ్లిపోతూ) భోగం దానియింట్లో ఒక్క నిమషం నిలబణ్ణు! అదంతా బాపనాళ్లకు చెల్లుతుంది.

నరహరి: (పరుగెత్తి శెట్టి రెక్క పట్టుకొని నిలబెట్టి) కాసులు, వుంగరాలు పెట్టు.

శెట్టి : సెయిముట్టు సరసం మాత్రం సెయకండి, మాటొస్తుంది.

నరహరి: యిస్తావా? యివ్వవా?

శెట్టి : దోపిడే!

నరహరి: ఆహా!

శెట్టి : యివ్వకుంటే యేటి సేస్తావు?

నరహరి: పిలకూడదీస్తాను.

శెట్టి : గవరుమెంటు బావుటా యెగురుతుండగా యెవడు పిలకట్టుకునేవాడు ?

నరహరి: యిదుగో నేను (అని పిలకపట్టుకుని వంచును.)

శెట్టి : బాబ్బాబు ! మీ మాట కెప్పుడయినా కోవటోఁడు అడ్డు పెడతాడా? మీ శెలవు! బాపనోరికి బంగారం యిచ్చుకుంటే పుణ్యం కదా! పితాళ్లు స్వర్గానికి పోరా? ముండ కాసులు మళ్ల ఆర్జించుకుంటాను; పుచ్చుకొండి! (కాసులు పుచ్చుకుని నరహరిరావు జుత్తు వదలివేయును.)

నరహరి: దెబ్బకు దెయ్యం వెరుస్తుంది.

శెట్టి : బాబు! దెయ్యమంటే నాకు వొల్లమాల్ని భయం! మరొగ్గెయ్యండి! ఈ కొంపలోంచి దాటిపోతే బతుకుతాను. (గడప దిగుతూవుండగా)

రత్నాం : వుంగరాలో?

నరహరి: వుంగరాలిచ్చి మరి వెళ్ళు!

శెట్టి : మీ శలవు! మీ శలవు కడ్డా? (వుంగరాలు తీస్తూ రెండడుగులు ముందు కేసి పరిగెత్తి పారిపోవును.)

(తెర దించవలెను)

గురుజాడలు

497

కొండుభొట్టీయము