పుట:Gurujadalu.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కా : (స్వగతం) యిది మాతండ్రి, పంతులు తల్లికి తయారు చేస్నిది. యింత పనివాడితనం వున్న యీ పాలెలు చితగొట్టుటకు చేతులు యెలా వస్తాయి. ఇది పంతులు యింటి వద్దపోయినదని కలవిలపడి వూరుకున్నాం. కానియ్యి! ఇది పంతులు భార్యకు యిచ్చి వేస్తాను (ప్రకాశం) యెంతట్లో కావాలి.

కొండి : యెంతవేగం వీలైతే అంత వేగం కావాలి.

అక్కా : సరే (మొలతాడు పెట్టిలో పెట్టి తాళం వేసి) మీకుర్రవాడు వచ్చినట్టుంది. చదువెలాగు వుంది?

కొండి : ఈ సరికి బాగా వుంది. యిప్పుడు మెట్రికిలేషను పరీక్షకు కడతాడు. యిరవై రూపాయీలు కావాలి. తమవంటి వారి సహాయం వుంటే గాని గట్టు దాటదు.

అక్కా : (ఇరవయి రూపాయీలు పెట్టిలోనుంచి తీసి యిచ్చి) గుప్తదానము యిది. యెవరితో చెప్పకండి.

కొండి : (అక్కాభత్తుడి చెవిలో) చూశారు మంజువాణి, డబ్బు లక్ష్యంగాని, డబ్బు జాగ్రత్తగాని వున్న మనిషి కాదు. బంగారం కరగడంలో కొంచెం కొంచెం చెయ్యి తడి చేసుకోవచ్చును. మా వాడి వివాహం వొకటి తటస్థించింది. డబ్బుకి వ్యాపకపడుతున్నాను.

అక్కా : అలాగేకానియ్యండి. తూనిక మీరు శెలవిచ్చి నట్టు అందాదుగా చూసుకొందాం. ఈసరకు యిలాగే వుంచీ నా దగ్గర బంగారం పెట్టి జమిలిగోవాతాడు తయారుచేస్తాను. కాని మీ కుర్రవాడు భూమిగుండ్రంగా వుండునని, రామాయణం అబద్దమని అంటాడట. మీరు విన్నారా? అవునుగాని వెంకన్నకి యింగ్లీషెందుకు చెప్పించారు గారు?

కొండి : ఒక్కడికి చెప్పించడమే కృత్యాద్యవస్తగా వుంది. ఇద్దరికీ చెప్పించడం నా తరమా?

అక్కా : వెంకన్నకే ఇంగ్లీషు చెప్పించి, రామ్మూర్తికే కావ్యాలు యెందుకు చెప్పించారు కాదు?

కొండి : అక్కాభత్తుడు గారు! అన్నీ యక్షప్రశ్నలడుగు తారు. మనమా చేసీవాళ్ళం. జాతక యోగం వుండాలి.

అక్కా : యోగం యెలావుంటే అలా వుండనియ్యండి కాని వెధవ ముండనెవర్తినీ పెంళ్లాడకుండా వివాహం ముందు చెయ్యండి.

గురుజాడలు

472

కొండుభొట్టీయము