పుట:Gurujadalu.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ : హిష్టరీ.

వెంక : విస్తరా?

రామ : చెరిత్ర

వెంక : అనగా?

రామ : తెలియనివాడితో యేమి చెప్పను. వేదాలు యెప్పుడు రాశారో, రామాయణం, భారతం, యెప్పుడు పుట్టేయో అవి యెంత నిజమో, యెంత అబద్ధమో....

వెంక : వేదాలు రాశేరు? రామాయణం అబద్ధమా?

రామ : ఆ! కావలసినంత. రాముడు దేముడు కాడుట. మహారాజు, రావణాసురుడికి ఒక్కటే బుర్ర, విన్నారా?

వెంక : ఈ పాపపు మాటలు వినగూడదు.

(చెవులు మూసుకొని పారిపోవును.)

గిరీశం : అజ్ఞానం! అజ్ఞానం పోతే గాని మన దేశం బాగుపడదు.

రామ : మా వెంకడికి మెదడు లేదు.

గిరీశం : మీ తండ్రి తెలివి వున్న మూర్ఖుడు. భోగం వాళ్ల యింటికి వెళ్లి ఆశ్రయిస్తాడు. నీ పరువు తీసి వేస్తూన్నాడు. సమయము చూచి చీవాట్లు పెట్టాలి.

రామ : అతనికి తోచినట్టు అతను చేస్తాడు. మనకు తోచినట్లు మనం చేదాం.

గిరీశం : డామిట్ (Damit), ప్రాణమయ్నా యిచ్చెయ్యాలి గాని రిఫారం విషయమై నదురూ, బెదురూ వుండకూడదు. లేకుంటే మనదేశం బాగుపడేదెట్లు? మనకి బంగాళీ వాళ్లలాగ పరువు ప్రతిష్ఠ వచ్చేదెట్లు?

రామ : అయితే సమయం చూసి చీవాటు పెట్ట మంటారా?

గిరీశం : ఇంక ఆలోచిస్తావా? అదుగో మీ తండ్రి వస్తూన్నట్టుంది. నన్నెరగనట్టు నటించు. రహస్యం భేదించకుండా నటించాలి.

రామ : యెందు కేమిటండి?

గిరీశం : మీ తండ్రి అసాధ్యుడు. నిన్ను గురించి యెంతో విచారిస్తూన్నాను.

రామ : ఆయనతో పరిచయము చేశారా యేమిటి?

గిరీశం : చేశాను. నీకు చేస్తానన్న పిల్ల ముక్కుపచ్చ లారని పసిపిల్ల. రిఫార్మర్ (Reformer) అనేవాడు అలాంటి పిల్లని పెళ్ళాడితే (Society looks down upon him) సంఘం నిరసనగా అతన్ని చూస్తుంది.

గురుజాడలు

467

కొండుభొట్టీయము