పుట:Gurujadalu.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ : అంచేతనే నేనూ సిగ్గుతో చచ్చిపోతున్నాను, తెగించి దేశాలంట పోదూనా అనిపిస్తూంది.

గిరీశం : నాతో యెన్నడు చెప్పకపోతివే?

రామ : యేమని చెప్పను. సిగ్గుచేత చెప్పలేదు.

గిరీశం : ఒకరి లోపాలికి మనం సిగ్గుపడనేల? చేతనయినంతవరకూ మళ్లిద్దాం. మళ్లకపోతే కనికరిద్దాం. సిగ్గుతోనూ, కోపంతోనూ పనిలేదు.

రామ : నామీద్దయ చేత మీరు అలా అంటారు. లోకంలో తలయెత్తుకు యెలా తిరగను.

(తెర దింపవలెను.)

ప్రథమాంకము

తృతీయ రంగము

(అక్కాబత్తుడి యింటి వీధి అరుగు)

(వెంకన్న, అక్కాబత్తుడు ప్రవేశించును)

వెంక : యేనుగులు దొబ్బేశాయండోయి.

అక్కా : యెవరియేనుగులు? విజయనగరం వారివా? బొబ్బిలివారివా?

వెంక : కాదండి, దిగ్గజాలు.

అక్కా : యెక్కడికి వెళ్ళిపోయినాయి?

వెంక : భూమి వెలగపండులా గుండ్రంగా వుందిష. అంచేత యేనుగులు మోత అక్కరలేదుష

అక్కా : భూమి వెలగపండయితే యేనుగులు వెలగ పండు తినేస్తాయి కాబోలు!

వెంక : మా రాముడు చెప్పాడు.

అక్కా : ఇంకా ఏమి చెప్పాడు?

వెంక : వేదాలేవళ్లో రాశారుష, రాములువారు మనీషష, దేముడు కాడుష.

అక్కా : మీకు కొండిబొట్లు ఇంగ్లీషు చదువు చెప్పించాడు కాడని నాకు కించగా వుండేది. ఇంగ్లీషు చదువు కిదే ఫలితమయితే మరి విచారం లేదు. తురకలు మెడకి కత్తి మొనజేర్చి గొడ్డు మాంసం తినిపించే వారు. ఈ యింగ్లీషు వాళ్లు చదువులు పెట్టి మనవేళ్ళతో మనకళ్లే పొడుస్తున్నారు. అదిగో మీ బాబు వస్తున్నాడు పారిపో.

(యిద్దరు నిష్క్రమింతురు. )

గురుజాడలు

468

కొండుభొట్టీయము