పుట:Gurujadalu.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాంకము

(ద్వితీయ రంగము)

(కొండుభొట్లు యిల్లు - వీధి సావిడి)

(రామ్మూర్తి, వెంకన్న, గిరీశం ప్రవేశించును.)

వెంక : రాముడు! పరీక్షంటే ఏమిటిరా?

రామ : పరీక్షంటే యెగ్జామినేషన్.

వెంక : (పొడుం పీల్చును) యజ్ఞం నాకు తెలుసును. మేషం అంటే మేక, మేకపోతు వేస్తారా ఏమిషిరా?

రామ : ఫూలిష్! యజ్ఞం కాదూ. మేషం కాదు. శాస్త్రాల్లో ప్రశ్నలు అడుగుతారు.

వెంక : నీకు శాస్త్రము వచ్చును? తర్కమా? వ్యాకరణమా?

రామ : నథింగ్ ఆఫ్ ది క్రైండ్ (Nothing of the kind) జాగర్ఫీ ఒకటి.

వెంక : అనగా?

రామ : భూగోళ శాస్త్రం.

వెంక : దానిలో యేమిటుందిరా?

రామ : వెలగపండువలె గుండ్రంగా వుండే భూం మీద యేయే నదులు, సముద్రాలు, కొండలు వగయిరాలు యెక్కడవున్నాయో చెప్పుతుంది.

వెంక : భూమి గుండ్రంగా వుంది? అబద్దం! అబద్దం! నలు చదరంగా వుంది. దాన్ని, అష్ట దిగ్గజాలూ మోస్తున్నాయి.

రామ : నాన్‌సెన్సు (Nonsense) "కపిద్దాకార భూగోళం” అని మనవాళ్లు కూడా అన్నారు. యేనుగులు మాట పాతమాట. అవి అన్నీ వెళ్ళిపోయినాయి.

వెంక : గుండ్రంగా వుంటే ఎవరు మోస్తున్నారు.

రామ : యెవ్వరూ మొయ్యలేదు. ఆకర్షణ శక్తి వల్ల భూగోళం అంతరాళంలో నిలిచియున్నది.

వెంక : అలా చెప్పు... అదొక కొత్త శక్తి పేరు చెప్పావు. యేదోవక దేవతలేన్ది యేదీ వుండదు. అయితే ఈ వెధవలు పత్సిమసముద్రం చూశారు?

రామ : ఓ! దాన్లోకి! ఓబి. యెనిసి, లీనా, అను మూడు నదులు, ప్రవహించును.

వెంక : అబద్దం, శుద్ద అబద్ధం, హిమవత్పర్వతానికి వుత్తరం చూడ్డం. మనుష్యులు వెళ్లితే చచ్చిపోర్రా! ఇదా. దొంగముండా శాస్త్రం. ఇంకా యే శాస్త్రం చదువుకున్నావు.

గురుజాడలు

466

కొండుభొట్టీయము