పుట:Gurujadalu.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 నానా : యేవిఁటండోయి శిష్యుడిచేత రాయిస్తున్నారు? (శిష్యుడితో) యేమి, అబ్బాయీ, కనబడ్డవేఁ మానేశావూ?

నారా : యేమీ లేదండి. గ్రంథం రాయిస్తున్నాను.

నానా : (శిష్యుడితో) యేదీ ఆ రాసింది చదువూ. (శిష్యుడు తలగోక్కుంటూ గురువ్వేపు చూచును).

నానా : (శిష్యుడి చేతులో పత్రం లాక్కుని చదువును, తలయెత్తి నారాయణభట్టుతో) యవరు చెప్పారండీ యీ శ్లోకం?

నారా : మా శిష్యుడూ.

శిష్యు : యింతకన్న బాగా చెప్పగలనండి.

నారా : యేడిశావూరుకో.

నానా : శ్లోకం మట్టుకు మహా బాగా వుందండి.

నారా : బాగుందంటారా? నాకు అలాగే తోచింది.

నానా : బాగుండడవఁంటే ఆలాగా యిలాగా అనుకున్నారా యేవిఁటి? బిల్హణుడి పద్యాన్ని పగలగొట్టారే!

నారా : మా శిష్యులు చెప్పమని పీక్కుతింటే యేదో చెప్పి చూదావఁని చెప్పాను.

నానా : తర్కం కురిపించిపోతిరే. యిఖ బిల్హణుడు తలదాచుకోవాలి.

నారా : పద్యం అంత ప్రశస్తంగావుందని శలవిస్తారా?

నానా : 'శలవియ్యడం” కాదు “మనవి” అనండి. మీ శిష్యకోటిలో వాణ్ణి మాట మరిచిపోకండి. ఆ శ్లోక ప్రాశస్త్యానికి, అవధి అంటూ వుందండి? మీరే కవిత్వం చెప్పడం ప్రారంభిస్తే, యీ కవీశ్వర్లంతా సూర్యుడి ముందర చుక్కల్లాగ చకాపికలై పోరా?

నారా : శాస్త్రాలు చదువుకున్న మా బోట్లకి కవిత్వం చెప్పడఁవన్నది, తక్కువ పని కాదండీ?

నానా : యీ రోజుల్లో తక్కువ విద్యలకీ, తక్కువ మనుష్యులకే యెక్కువ విలువ. “రాజద్రోహీ! తులువా!” అని కాశ్మీరం నుంచి, అక్కడి రాజులు వెళ్ళగొట్టిన, యీ బిల్హణుడికి మహా ప్రాజ్ఞులైన మన మహారాజులే, మీ అందరికంటే యెక్కువ గౌరవం చేస్తున్నారు? కారా?

నారా : బిల్హణులను కాశ్మీరం నుంచి వెళ్ళగొట్టారండీ?

గురుజాడలు

448

బిల్హణీయము