పుట:Gurujadalu.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేశ : సత్యమే అన్నదాతా! పూర్వ పశ్చిమ సముద్రములకు వార ఏమిటి? అసాధారణ ప్రతిభావంతులగు మహాపండితులచే ఉత్పాదితమైన వాక్పరంపర భగవదుత్పాదితమగు సృష్టి పరంపర వలెనే (చెయ్యి రామశాస్త్రి వైపు తిప్పి) అస్మదాదులకు ఆశ్చర్య జనకమై యెన్న నశక్యమై యుండును. విష్ణ్వంశ సంభూతులగుటను, వారపారలు యేలినవారికే తెలియవలయు.

కర్ణ : రామశాస్త్రుల్లు గారు యేమంటిరి?

రామ : మహారాజా! కేశవభట్టు గారు తార్కికులు గనుక, వాదాదర మనుస్కులు. మంచిదేకానివివాదాంశము వస్తుతత్వమును గూర్చి కాక, పరవస్తుతత్వమును గూర్చి కాక, ఒక వ్యాకరణ సూత్ర మందు ఒక్క మాటకు వినియోగమున్నదా లేదాయను కుశంక ననుసరించియున్నప్పుడు, అట్టివాదము కాలము వెళ్లపుచ్చునుగాని, తత్వాన్వేషణమునకు కానేరదు. సూత్రములు ఋషి ప్రణీతములు. మార్పబడనేరవు. గాన వాదమునకు చరితార్థము తక్కువ. వినోదార్ధముచేయు ప్రసంగములకు వీగు గెలుపు లెక్కడివి మహాప్రభో!

కేశ : వ్యాకరణము వేదాంగమై, శబ్దబ్రహ్మమును గూర్చిన శాస్త్రమైనపుడు చరితార్థము లేకుండుట యెటుల?

“అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజనశలాకయా,
చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమః”
అనే శిక్షావాక్యము నిరర్థకము కానోపునా?

విదూషకుడు : వారివ్యాకరణ శాస్త్రము శబ్ద బ్రహ్మపరము. మీ తర్క శాస్త్రము అర్థబ్రహ్మపరము. అర్థబ్రహ్మాన్నే అందరూ ఉపాశిస్తారు. శబ్ద బ్రహ్మంతో సంతుష్టి తక్కువ. అర్థం మాట కొస్తే మంత్రి నానాపంతులు మహాపండితులు. మీరంతా నీరర్థకులే!

రామశాస్త్రి: స్వారస్యం బాగా తీశావూ.

మంత్రి నానాపంత్ : చుట్టూ తిరిగి ముక్తాయింపు నా మీదే?

విదూ : నిజం చెబితే, నిష్ఠూరం! “యస్యాస్తివిత్తం, సనరః కులీనః సపండితః" అనలేదా?

రామ : అవును; కాకేమి? అర్థశాస్త్రంలో నానామంత్రులు పండితులే!

విదూ : ఆ మాటే నేనంటే హాస్యం. మీరంటే నిజం.

కర్ణముహారాజు : నిజమనేది యేమిటో?

గురుజాడలు

431

బిల్హణీయము