పుట:Gurujadalu.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విదూ : మంత్రులాడే మాటలల్లా నిజం.

కర్ణ మహారాజు : వారు అబద్ధమాడినా నిజమౌతుందా?

విదూ : సాగింది నిజం, సాగంది దబ్బర. మంత్రులనే మాట సాగుతుంది గనుక, వారనే మాటల్లా నిజమే. ఇంకా ప్రభువుల మాటే, సాగక, తరుచు దబ్బరౌతుంది.

కవి కృష్ణస్వామి : గౌతముడిది యేదో వినియోగంగల వాదం గాని, వ్యాకరణ వాదంలాగ నిరర్థకం కాదు.

కర్ణమహారాజు : మంత్రివర్య! గౌతముల యెడల మనమేమో అపరాధము చేసినట్టుంది.

నానామంత్రి :మహాప్రభో, ప్రభువులకు ధనం కూడికచేస్తే అది అందరికీ అపరాధమే.

విదూ : యెన్ని అక్రమాలు చేసినా, మంత్రులకు యిది వక డాలు దొరికింది. నీతినిపుణుడైన మంత్రి, స్వప్రతిభవల్ల కొత్తమార్గాలు కల్పించి, ధనసంగ్రహం చెయ్యాలిగానీ, రాజునూ, రాజునాశ్రయించుకున్న వాళ్ళనూ యెండు చాపలవలె యిగరగట్టడమా, ప్రయోజకత్వము?

కవి కృష్ణస్వామి : మరి వారి జాగ్రత ప్రభువులకు వ్యక్తం కావడ వెఁలాగ?

విదూ : గనక ఆస్థానమందు కనిపెట్టుకుని వున్నవాళ్ళకే, మొదట తాళం పట్టాలి. పయిన యెంత దూబర అయినా చింతలేదు.

కవి కృష్ణస్వామి : మహాప్రభో, మన ఉద్యోగస్థుల మీద గౌతముడు పద్యం చెప్పాడు. చిత్తగించ తగి వున్నది.

కర్ణమహారాజు : యేదేది?

గౌతముడు : వారి మహిమ “అతీతః పంథానం! వాజ్మనసయో?” అయినా “చకితమభిధత్తే" అన్నట్టు చెప్పాను.

క. దబ్బరలుం గొండెమ్ములు
    మబ్బువలెంగ్రమ్ము మాయ మాటల తీపున్
    నిబ్బరపు మొండితనమును
    నబ్బురమగు విద్య లిచటి యధికారులకున్.

కృష్ణస్వామి : అక్షరలక్ష ఇయ్య తగి వుంది.

నానామంత్రి : హాస్యగాణ్ణి అయినా, హద్దుమీద వుంచాలి.

కర్ణమహారాజు : (చిరునగవుతో) హద్దుమాలిన మనిషి ఒక్కొకడు ఉంటేనే గానీ, హద్దు యొక్క గుణాగుణములు తెలియవు. మనవలె ఉచ్ఛావస్థలో నున్న వారిని స్వేచ్ఛగా తిట్ట

గురుజాడలు

432

బిల్హణీయము