పుట:Gurujadalu.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 బిల్హ : బ్రాహ్మణోత్తములకు నమస్కారము.

రామ : (నారాయణశాస్త్రితో) చూశారా బ్రాహ్మణోత్తములంటాడు గాని పండితులనడు. (బిల్హణుడు సభామంటపంలో నిలుచున్న వారిని, చూపు విసురున పరికించి నారాయణభట్టు దగ్గిరకు పోయి కౌగలించుకొనును.)

బిల్హ : పండితోత్తమా, మీరు పతంజలి అపరావతారము. మీ వాగ్ధోరణి నిన్న నాకు అపూర్వ కర్ణానందము చేసినది. నన్ను మెప్పించిన వైయాకరణి కిత్తునని నే ప్రతిజ్ఞ చేసిన యీ రుద్రాక్షమాల మీ కంఠము నలంకరించు గాక! (తన మెడలోని బంగారు కట్టిన రుద్రాక్షమాల నారాయణభట్టు మెడను వేయును. )

నారా : వద్దు-వద్దు-వద్దు. నేం తగను, మీ వంటి మహానుభావుల మెప్పే పది కోట్లు.(రుద్రాక్షమాల చేతబట్టి తీయునటుల అభినయించుచు కేశవభట్టు వంక చూచును. నలుగురు పండితులును చుట్టూ మూగుదురు.)

కేశ : మహాపండితుడు చేసిన సన్మానం ప్రభుసన్మానముకన్న దొడ్డది. ఉంపించండి.

బిల్హ : యీ అపూర్వమయిన మాల రాజపండితుడైన కర్ణమహారాజు కంఠమును మున్ను అలంకరించెను, ఇప్పుడది పండిత రాజు కంఠము నలంకరించినది.

రామ : (మాధవ శర్మతో మెల్లగా) మహారాజిచ్చిన మాల భట్టు కిచ్చాడు. యేమి యితగాడి పొగరూ!

మాధ : (రామశాస్త్రీతో) వీడు యెన్నాళ్లో దక్కడు.

(పూజ బ్రాహ్మడు ప్రవేశించి)

పూజ : మహాప్రభువువారు పూజాగృహానికి విజయం చేశారు.

(పండితులు వస్త్రములు సవరించుకొని బ్రాహ్మణుడి వెంట పోదురు. )

రెండవ రంగము

(కర్ణమహారాజు పూజామంటపము. రాజు పూజ చేయుచుండును. ఇరు పక్కలనూ పండితులును, ఉద్యోగస్తులును కూర్చుని యుందురు. )

కర్ణ మహారాజు : నిన్నటి వాదములో యవరు గెలిచినట్టు?

కవి రామశాస్త్రి : గెలుచుటకూ, వీగుటకు యేమున్నది మహారాజా ?

గురుజాడలు

430

బిల్హణీయము