పుట:Gurujadalu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం: లుబ్ధావధాన్లు మాపెత్తల్లి కొడుకండి, తమతో సమ్మంధవఁంటే నాకు సంతోషవేఁ గానండి. ఆయనకి అరవయ్యేళ్లు దాటాయండి, యీడేవఁయినా సెల్లింగ్ గర్లస్ అనగా కన్యాశుల్కం, డామిట్! యంత మాత్రమూ కూడదండి, నేను పూనాలో వున్నప్పుడు అందు విషయమై ఒహనాడు నాలుగ్గంటలు ఒక్కబిగిని లెక్చరిచ్చానండి. సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం కూడని పనని తమ చేతనే వొప్పిస్తాను. కరట : బావా యీ సమ్మంధం చేస్తే నీ కొంపకి అగెట్టేస్తాను. అగ్ని : వీళ్లమ్మా శిఖాతరగ, ప్రతీ గాడిద కొడుకూ తిండిపోతుల్లాగ నా యింట జేరి నన్ననేవాళ్లే, తాంబోలం యిచ్చేశాను, యిహ తన్నుకు చావండి. వెంకమ్మ : నాతో చప్పకుండానే? అగ్ని : ఆడముండలోనా ఆలోచన? యీ సమ్మంధం చైకపోతే నేను బారికరావుఁణే! (లేచి వెళ్లును.) కరట : యెం మార్దవం వెంక : అన్నయ్యా! యీ సమ్మంధం చేస్తే నేన్నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూనే వున్నాం. ఆయనికి యంత యీడొచ్చినా కష్టం సుఖం వొళ్లు నాటక యీ దౌర్భాగ్యపు సమ్మంధం కల్పించుకొచ్చారు. నే బతికి బాగుం డాలంటే యీ సమ్మంధం తప్పించు. కరట : గట్టి అసాధ్యం తెచ్చి పెట్టావే, వొట్టి మూర్ఖప గాడిద కొడుకు. యెదురు చెప్పిన కొద్దీ మరింత కొట్టెక్కుతాడు, యేంచేయగల్గుదునని నీకు భరువసా చెప్పను? యేమీ పాలుపోకుండా వుంది. గిరీశం : అమ్మా - మీరు యెందుకలా విచారిస్తారు? అవుఁధాన్లుగారు సావకాశంగా వున్నప్పుడు ఒక్క గంట కూర్చుంటే డబ్బుచ్చుకు ముసలివాళ్లకి పెళ్లిచెయ్యడం దౌర్జన్యవఁనీ లెక్చరిచ్చి మనసు మళ్లిస్తాను. వెంకమ్మ : బాబూ, అతడు మీ మానత్త కొడుకైతే మీ కాళ్లు పట్టుకుంటాను, మీరు వెళ్లి ఆయ్న మనస్సు మళ్లిస్తురూ. నా చర్మం చెప్పులు కుట్టియిస్తాను. గిరీశం: అమ్మా యేం చెప్పను! వాడో త్వాష్టం. పిల్ల దొరకడవేఁ చాలువాడికి. యీ సమ్మంధం వొదులుకుంటే వాడికి పెళ్లే కాదు. వాడని వాడొదిలే ఘటం కాడు. కరట : అమ్మీ, నేనో ఉపాయం చెబుతాను యిలారా. (కరటకశాస్త్రి, శిష్యుడు, వెంకమ్మ నిష్క్రమింతురు.) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 237