పుట:Gurujadalu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుబ్ధావ: నాకున్న బంధువులంతా నాదగ్గిర డబ్బు లాగాల్ని చూశేవాళ్లే కాని కష్టసుఖాలకి పనికి వచ్చేవాడు ఒక్కడయినా లేడు.

గిరీశ : ఒహణెత్తినైనా ఓ దమ్మిడి కొట్టిన పాపాన్నెప్పుడైనా పోయినావూ? నే కాబట్టి నీ ఆపద సమయంలో వచ్చాను కాని నీ బంధువులందరికీ నీయందు పిసరంతయినా అభిమానం లేదు.

లుబ్ధావ: లేకపోతే పీడా నాడా కూడా పాయెను.

గిరీశ : నీదగ్గిరొక దమ్మిడీ నేనాశించి రాలేదు. దత్తత చేసుకుని యప్పటికైనా తరుణోపాధి చూసుకొమ్మన్నాను.

లుబ్ధావ: యిక్కడంతయింది, యిహ ముందు లోకం మాట ఆలోచించుకుందాం.

గిరీశ : నీకోవేళ సిక్షైపోతే నీ వ్యవహారాలూ సవహారాలూ చూశేవాడెవడైనా వుండాలిగదా? నీ సన్నిహిత బంధువుల్లో యింగ్లీషొచ్చినవాణ్ణి నే నొక్కణ్ణే. నాకో పౌరాఫ్‌టర్నామా ఐనా గొలికిచ్చేయ్.

లుబ్ధావ: నువ్వెందుకు నన్ను దుఃఖంలోవున్నవాణ్ణి మరింత దుఃఖపెడతావు? అన్నిటికీ సౌజన్యారావుపంతులుగారున్నారు. ఆయ నెలా చెబితే అలా చేస్తాను.

గిరీశ : (తనలో) యీ సౌజన్యరావు పంతులు మా అసాధ్యపు ఘటంలా వున్నాడు. అతణ్ణి చూసిన దగ్గర్నుంచీ బ్రహ్మన్లక్ష్యపెట్టనివాణ్ణి నాకే కంపరం కలుగుతూంది.

(బంట్రోతు ప్రవేశించును)

బంట్రో: అవధాన్లుగారూ! సౌజన్యరావుపంతులుగారు రమ్మంటున్నారు.

గిరీశ : ఆఁ. ఆఁ. మరిచిపోయినాను. నే నిప్పుడక్కడినుంచే వచ్చాను. ఎవరో గుంటూరి శాస్త్రుల్లు వారింటి కొచ్చాడట. నిన్ను పిలవమన్నాడు.

లుబ్ధావ: (ముఖమున నాతృత గనుపరచుచు) ఏమిటీ! గుంటూరి శాస్తుల్లే! ఇదుగో వస్తున్నాను. (వళ్లంతా వణుకును). (లుబ్ధావధాన్లు, గిరీశం నాలుగడుగులు నడచునంతటికి పోస్టు బంట్రౌతు కనుబడును)

పోస్టు బం: మీరేటండీ లుబ్ధావధాన్లుగారు?

లుబ్ధావ: అవును, ఎందుకేమిటి?

పోస్టు బం : మీపేర పన్నెండు వందలూపాయలు మనీ ఆర్డరొహటీ, బంగీవహటీ వచ్చింది.

లుబ్ధావ: (తనలో) నాపేర మణీ ఆర్డరేమిటి చెప్మా! (పైకి) ఏదీ యిలాతే.

గురుజాడలు

205

కన్యాశుల్కము - తొలికూర్పు