పుట:Gurujadalu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పో.బం: యీ వూరి పెద్దమనుష్యులెవరైనా సాక్షి సంతకం చేస్తేనే కానీ యిస్తే మాకు మాట వస్తుంది.

లుబ్ధావ: అయితే సౌజన్యరావు పంతులుగారి యింటికి, రా, ఎవరి దగ్గిర్నుంచొచ్చిందేమిటి మణీ ఆర్డరు?

పో.బం: (కాగితము తీసిచూచీ) యెవరో గుంటూరి శాస్తుల్లట..

లుబ్ధావ: ఏమిటేమిటి? ఆ కాయితం యిలా చూడ్నీ (అనీ వణుకుచున్న చేతితో కాగితము పట్టుకొని చూచి) గుంటూరి శాస్త్రుల్లేమిటి మణీ ఆర్డరు పంపించడం యేమిటి? యిదీ నిజమేనా?

పో.బం: అవునండీ. ఆ ఫారములో అలావుంది.

గిరీశ : (పోస్టు బంట్రౌతును గోకి, లుబ్ధావధాన్లుతో) కావలిస్తే నేసాక్ష్య సంతకం చేస్తాను. పుచ్చుకో రూపాయిలు. సంచీ నే మోస్తాన్లే. శుభస్య శీఘ్రం అన్నాడు.

లుబ్ధావ: అహం; అహం; అలాకాదు వేగిరంరా, సంజీవరావు పంతులుగారి దగ్గిరకి వెళదాం. (అనీ నడచుచు) గుంటూరి శాస్త్రుల్లేవూరి నుంచోయి యిచ్చాడు.

గిరీశ : యిలా తెండి చెట్టాను. (అని లుబ్ధావధాన్లు చేతిలో నుంచి కాగితము లాగును)

లుబ్ధావ: వద్దొ ద్దొ ద్దొ ద్దొ ద్దొ ద్దు. (అనీ కాగితము వదలడు)

గిరీశ : (లుబ్ధావధాన్లు చేతిలోనుండగానే కాగితము చూచి) వైజాగపటామ్, అనగా, యీ వూరునుంచే.

లుబ్ధావ: (బుర్రెత్తి చూచి ఆశ్చర్యము ముఖమున గనుపరచుచు) అడుగో గుంటూరి శాస్తుల్లా సందులోను, మన్ని చూచి పరుగెత్తుతున్నాడు. (అని లుబ్ధావధాన్లు పరిగెత్తును)

గిరీశ : యేమిటి వెర్రెత్తిందా వీడికి! (అనీ లుబ్ధావధాన్లుతో కూడా నాలుగడుగులు పరుగెత్తి కరటకశాస్త్రులు కనబడగానే వెనకకుతగ్గి, లుబ్ధావధాన్లు చేయిబట్టుకు వెనుకకులాగి) వీడుకాదు గుంటూరిశాస్త్రులు. అతను వలంగా వుంటాడు. అతన్ని సౌజన్యరావు పంతులుగారింట్లో చూశాను. ఇతను కరటకశాస్త్రులు,

లుబ్ధావ: (జాపోయుచు) నీకు తెలియత్తెలియత్తెలియదు. వీణ్ణి పట్టుకో. పట్టుకుంటే యీమణీ ఆర్డర్రూపాయలు నీ కిచ్చేస్తాను.

గిరీశ : (ఒక్కక్షణ మాలోచించి ముందువెనుకజూచి) ఆల్‌రైట్ (అని పరుగెత్తును) (ముందు గుంటూరిశాస్త్రులు. వెనుక గిరీశం తెరచుట్టు పరుగుపెడుదురు. )

(ఆ వీధిలోనే మరియొక చోటు)

గురుజాడలు

206

కన్యాశుల్కము - తొలికూర్పు