పుట:Gurujadalu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సౌజన్య: ఆయన కుమార్తెమీద కూనీకేసు వచ్చినమాట యెరుగుదురు కాదూ! డెప్యూటీ కలెక్టరు బ్రహ్మద్వేషి; బలమైన డిఫెన్స్ సాక్ష్యం దొరక్కపోతే కమ్మెంట్టైపోతుంది. ఆయనికి పిల్లనిచ్చిన గుంటూరి శాస్రుల్లెవరో మీకు తెలుసునా?

గిరీశ : నాకు ఆసంగతి మట్టుకు తెలియదండి. శలవయితే అదెంత భాగ్యం కనుక్కుంటానండి.

సౌజన్య: వెతగ్గా వెతగ్గా వూళ్లో గుంటూరు కాపరం అని చెప్పుకునే అవధాన్లొకడు దొరికాడు. ఆయన్ని మా యింటికి పిలిపించాను. ఇప్పు డిక్కడే వున్నాడు. వెళ్లి రహస్యంగా యీ సంగతి లుబ్ధావధాన్లుగారితో చెప్పి వేగిరం తీసుకురండి.

గిరీశ : ఆయన్కెడ బసచేశారండి?

సౌజన్య: జగన్నాధస్వామి కోవిల కెదురుగుండాను.


(గిరీశం వెళ్లును. తెర దించవలెను)

***

మూడవస్థలము - (లుబ్ధావధాన్లుగారి బస)

లుబ్ధావ: రామనామతారకం భక్తిముక్తిదాయకం (అని పఠించుచుండును)

గిరీశ : (ప్రవేశించి) అన్నయ్యా (అని యేడ్చుచు కౌగలించుకొనుచు)

లుబ్ధావ: రామనామతారకం భక్తిముక్తిదాయం -

గిరీశ : మీ మీద కూనికేసొచ్చిందని తెలిసి నిద్రాహారం లేకుండా యెకాయకీని వెళిపోయి వచ్చాను. మా అన్నయ్యకీ వాళ్లకీ కబురంపించావు కావేమి?

లుబ్ధావ: ఎవడేం చెయ్యాలి? అన్నిటికీ సౌజన్యరావు పంతులుగారే వున్నారు. అయితే అబ్బీ అగ్నిహోత్రావధాన్లుగాడి కూతుర్ని లేవదీసుకు వెళ్లిపోయినావట్రా! వాడికి తగిన శాస్త్రి చేశావు. దాన్ని పెళ్లి మాత్రం ఆడ్లేదుగదా!

గిరీశ : అంత తెలివితక్కువపని చేస్తానా? నువ్వు నన్ను పెంచుకుంటావనీ, పెళ్లి చేస్తావనీ మావాళ్ళు కొండంత ఆశ పెట్టుకున్నారు గదా!

లుబ్ధావ: యీ గండం గడిస్తే పెంపకంమాట ఆలోచించుకుందాం.

గిరీశ : (గద్గదస్వరంతో) గడిచేటట్టు కనపడదట. సౌజన్యరావు పంతులుగారన్నారు. డెప్యూటీ కలెక్టరు బ్రహ్మద్వేషట. కడుపు సముద్రం అయిపోతూంది (అని కళ్లు తుడుచుకొనును) విధికృతం తప్పించడాని కెవడి శక్యం, కానీ, ముందు గతన్నా చూసుకో. ఓ దత్తపత్రిక రాసిచ్చేస్తే కాపుదారీగా వుంటుంది.

గురుజాడలు

204

కన్యాశుల్కము - తొలికూర్పు