పుట:Gurujadalu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్నిహో: ఓహో బాగుంది వ్యవహారం! రామప్పంతులేడీ?

నాయడు: (మెల్లగా వెనుకనుండివచ్చి) ఫోర్జరీమాట రాగానే సన్నగా జారారు యీపాటికి వారివూరికి సగంతోవలో వుంటారు.

అగ్ని: అయ్యో కొంపతీశాడే!

నాయడు: ఇంగ్లీషు వకీలు సరదా తీరిందా? ఫోర్జరీకి తమక్కూడా మఠప్రవేశం అవుతుంది.

అగ్ని: అయ్యో నీ యింటకోడి కాల్చా.

నాయడు: రోజూ కాలుస్తూనే వుంటారు.

(అందరునూ నిష్క్రమింతురు)

(సౌజన్యారావుగారి బస)

(కుర్చీమీద సౌజన్యారావుగారు కూరుచొని యుందురు, బంట్రౌతొక కార్డు తీసుకొనివచ్చి యిచ్చును)

సౌజన్య: (కార్డు చూచుకొని) జె.యస్.గ్రీస్. (బంట్రౌతుతో) డ్రెస్సు వేసుకుని వస్తానుండు (అని వెళ్లి డ్రెస్సు వేసుకొని వచ్చి కుర్చీమీద కూరుచొనును)

సౌజన్య: (బంట్రౌతుతో) ఆయన్ను పిలు.

(బంట్రౌతువెళ్లి గిరీశమును లోపలికి పిలుచుకొనివచ్చును)

సౌజన్య: ఈయనెవరు. దొరగారేరి?

బంట్రౌ: యీయనేనండి కార్డుయిచ్చారు.

గిరీశం: ఐ యామ్, గిరీస్, సర్; వీరయ్య పంటులుగారూ, ఆఫ్ రామవరం, సెంట్‌మీ.

సౌజన్య: ఇదేమిటి వికారం గ్రిసేమిటి? క్రిస్టియనువుటయ్యా?

గిరీ: చిత్తం, చిత్తం, చిత్తం, కాను.

సౌజన్య: మీరు వచ్చిన సంగతి విషయమై ఆతరవాత చెబుతాను. కొన్ని రోజుల క్రిందట మీ విషయమై వీరయ్యపంతులుగారు నా పేర వ్రాసినారు, నేను అందు విషయమై భోగట్టా చెయ్యడంలో పాపం లుబ్ధావధానులుగారి కేసు సంగతి నాకు తెలిసినది. అందు విషయమై కొంత ఇన్‌టరెస్టు పుచ్చుకుని పనిచేస్తూవున్నాను. లుబ్ధావధాన్లుగారు మీకు బంధువుణ్ణని చెప్పారు యేమి బంధుత్వం యేమిటి?

గిరీశ: అతను మా పెత్తల్లి కొమారుడండి.

గురుజాడలు

203

కన్యాశుల్కము - తొలికూర్పు