పుట:Gurujadalu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుబ్ధావ: (లోపలనుంచి) యెవరయా?

రామప్ప: నేనయ్యా రామప్పంతులుని.

లుబ్ధావ: (నిమ్మళముగా) రామప్పంతులు... అమ్మీ తలుపుతియ్యవే.

(తలుపు తియ్యును)

రామప్ప: మామగారూ మీ వంట్లో తాజాగావుందిగద?

లుబ్ధావ: యేమితాజా అండి

(అని యూరకుండును.)

రామప్ప: కోడలు మాజోరుచేస్తూన్నట్టు కనబడుతూంది. వూరు హాకర్లంతా మీ గుమ్మంముందరే కనబడతారు.

లుబ్ధావ: (మోకాళ్లమీద బుర్ర పెట్టుకుని నిమ్మళముగా) ఆ ఊ ఊ ఉ!

రామప్ప: (తనలో) ఆ మాటలు యిష్టములేదు కాబోలు (పైకి) ఆకంటెకు చాలా తొందరగా వున్నది. మధురవాణి యేమీ నీలవనియ్యకుండా వుంది. అదీ తాకట్టు పెట్టానన్న అనుమానంకొద్దీ యిప్పుడు తెస్తేనేకానీ వల్లకాదని కింకపట్టుపట్టి కూర్చున్నది.

లుబ్ధావ: అదికూడా పారిపోయింది.

రామప్ప: కంటె పారిపోయిందీ! ఏమిటి! మామగారు పలవరిస్తూ వున్నారా యేమిటి?

లుబ్ధావ: లేదండీ పలవరింతగాదు - కంటెపట్టుకుని చెప్పకుండా పరారీ అయిపోయింది. యిదంతా మీ కుట్రే..

రామప్ప: ఏమిటీ! అయితే కంటె యిస్తావా, యివ్వవా?

లుబ్ధావ: నా దగ్గిరలేదు.

రామప్ప: వద్దుసుమా నా సంగతి తెలిసిందికాదు నీకు.

లుబ్ధావ: నాకు అంతా తెలుసును. నాచేత పద్దెనిమిది వందలు కర్చుచేయించావు.

రామప్ప: (బుర్ర తటాయించి ఆలోచించీ తనలో) అన్నా మించిపోయినది. యేదైనా వక యెత్తు యెత్తితేనేకాని కంటె రావడము కష్టము. (పైకి) మొన్నరాత్రి మీ ఇంట్లో పెద్దకేకలూ,పెడబొబ్బలూ జరగలేదూ?

లుబ్ధావ: అయితే!

రామప్ప: అయితే మరేమిటి - మీ అమ్మి దానితో దెబ్బలాడి నూతులో పడేసింది. నేను పెరట్లో గుడ్డెమీదికి బాహ్యానికిపోయి స్వయంగా చూచాను.

గురుజాడలు

175

కన్యాశుల్కము - తొలికూర్పు