పుట:Gurujadalu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవస్థలము - రామప్పంతులుగారి యిల్లు

రామప్పంతులు గడప వెలుపలను, మధురవాణి లోపలను, నిలువబడుదురు.

రామప్ప: నీకంత పెంకెతనంగావుంటే పెళ్లిచేసుకుని గృహస్తాశ్రమంలో ప్రవేశిస్తాను.

మధురవాణీ: అరవైయేళ్లు వచ్చి చదువుకోక మన్ను కొట్టుకుంటానా అన్నట్టున్నది. యీ వెర్రికబుర్లకు యేమిటి - యేదో వొక తంబళ అనుమానం పెట్టుకుని చెర్రూ బుర్రూ అంటూవుండడం మీకు స్వభావమే. మెడలో కంటే తీసుకొని పోయినారు - అది యెక్కడనో తాకట్టుపెట్టి నేను యేమంటానో అనీ నామీదికే బయలుదేరుతున్నారు.

రామప్ప: కంటె తాకట్టు పెట్టుకోడం ఖర్మమేమి? నిలబడ్డపాటుగా చూడు కంటెలు వర్షం కురిపిస్తాను.

మధుర: నాకాకబుర్లేమీ పనికిరావు - మీ ప్రయోజకత్వం నాకు తెలుసును. నాకంటిప్పుడు తీసుకొస్తారా లేదా?

రామప్ప: నీకు మతిపోతూంది. నన్ను తృణీకరించడం ఆరంభిస్తున్నావు. నా దెబ్బ తెలియకుండా వుంది.

మధుర: మేడిశినట్టే వుంది.

రామప్ప: నాకు వొళ్లు మండుతూన్నది. ఖబడ్దార్!

మధుర: మీకు వొళ్లుమండుతూంటే గాల్లో నిలబడితే చల్లబడుతుంది.

(అని తలుపువేసికొనును. )

రామప్ప: యీ కంటేబాధ మా ఇబ్బందిగా వున్నది. తాకట్టుపెట్టానని ప్రాణం కొరికేస్తూంది. రేపు వుదయం తెస్తానంటే వినదు. యీ చీకట్లో లుబ్ధావధానులు ఇంటికి పోకతీరదు. యీ కంటె తాకట్టు పెట్టానని గట్టి అనుమానము పట్టుకుంది. తీరా వెళితే యిప్పుడు పెట్టా బేడా తీసియిస్తాడో ఇవ్వడో.

***

ఎనిమిదవస్థలము - లుబ్ధావధానులుగారి యిల్లు

రామప్ప: (తలుపు వెలపలనుంచి గట్టిగా) అవధానులు మామగారూ! అవధానులు మామగారూ! తలుపండోయి (అని అనేక పర్యాయములు పిలిచి) యేమిటి చెప్మా, దొంగగాడిదె పలకడు. నిద్రమాట అబద్ధం. దొంగల భయంచాత వీడురాత్రల్లా మేలుకుంటాడు. (గట్టిగా) తలుపు తియ్యకపోతే వుతకయెత్తి చేస్తాను.

గురుజాడలు

174

కన్యాశుల్కము - తొలికూర్పు