పుట:Gurujadalu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుబ్ధావ: గాడిదెకొడకా! (అని కర్రపట్టుకొని లేచును).

రామప్ప: ముసలిగాడిదకొడకా నీ పనిపట్టిస్తాను.

(అని వెళ్లిపోవును)

***

కన్యాశుల్కము

చతుర్థాంకము

(బైరాగీ, హేడ్ కనిష్టేబు, దుకాణాదారుడు, యింకా మరిద్దరు, మధ్యను సీసాలు పెట్టుకుని ప్రవేశించుదురు.)

(తెరతీయు ముందర నారాయణ నారాయణ నారాయణభజే అను కీర్తన పాడుచుండవలయును.)

హేడ్ : గురోజీ తమరు హరిద్వారం బయలుదేరి యెన్నాళ్లయిందేమిటి?

బైరాగి : రెండు రోజులయినది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం సేవించాము. ప్రచ్ఛన్నంగా సింహాచలం పోతూవుంటే నువ్కోక భక్తుడవు పట్టుకొని ఆపేశావు.

హేడ్ : ఆహా! యోగమహత్యం - ముక్కు బిగించి స్తానాలుచేసే బ్రాహ్మలకెవరికీ యీ సిద్ధుల్లేవుగదా?

బైరాగి : వాళ్లకేమీ తత్వము తెలియదు. మా తాతగారు చెప్పిన పద్యం నీవు వినలేదా? ఆత్మ శుద్ధిలేని ఆచారమదియేల.

హెడ్ : వేమన్న మీ తాతేనా గురోజీ?

బైరాగి : అవునోయి నాకు మూడువందల యేళ్లున్నవి, ఆయన పరంపదం వేంచేసి వెయ్యి సంవత్సరము లౌతవి.

దుకాణ: ఆహా! యివాళ మనదేమదురుష్టం. గురోజీ! నౌకరి కొక సందేహం వున్నాది. పరబ్బరమం సీసాలో కనపడ్డంత సొట్టంగా మరొకసోట అగుపడుతుందా?

బైరాగి : యీ రహస్యం నీకేలాగు దెలిసిందేమిటి? అమృతమంటే సారాయి కాదురా పామరుడా - నాడు దేవాసురులు యిదే చెడతాగినారు.

గురుజాడలు

176

కన్యాశుల్కము - తొలికూర్పు