పుట:Gurujadalu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్ని పుటలను, వాక్యాలను, పదాలను చదివి, గుర్తించి ఆ విషయాలన్నీ చేర్చాము. వ్యక్తుల పేర్లు, పుస్తకాల పేర్లు, అనేక విషయాలను శోధించి గురజాడ దినచర్య గ్రంథానికి మరింత నిండుతనాన్ని తెచ్చామని భావిస్తున్నాము. మాకు ఒక పదమైనా, వాక్యమైనా, ఒక పేజీ మొత్తమైనా బోధపడకపోతే (...) గుర్తుతో సూచించాము లేదా not legible అని పేర్కొన్నాము. దినచర్యలో ఒకటి రెండు చోట్ల రైళ్ళ రాకపోకల వివరాలో, రూపాయనోట్ల నంబర్లో, షేర్ మార్కెట్లకు సంబంధించిన సంఖ్యలో అచ్చువెయ్యకుండా విడిచిపెట్టాము.

My Own Reflections, Observations, Remarks etc.కు సంబంధించి ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గురజాడ తన అనుభవాలను, అనుభూతులను, పరిశీలనలను నోట్సుగా రాసుకున్నారు. వీటన్నిటికీ ఇప్పుడు లభిస్తున్న టైపు ప్రతి తప్ప రాత ప్రతి లేదు. అట్లాగే గురజాడ ఆనందగజపతి మహారాజుతో తన అనుభవాలను కూడా నోట్సుగా రాసుకున్నారు. టైపు ప్రతిలో M.0. అని, H.H. అని వీటికి శీర్షికలు పెట్టారు. టైపు ప్రతుల్లో (కే.వి.ఆర్.వి) ఆయా శీర్షికలతోపాటు కాగితం పైన ఒక కొనలో M.O. అని, H.H. అనీ ఉంది. ఒక కాగితం మధ్య భాగంలో M.O. = My Own Reflections, Observations, Remarks etc. అని మాత్రమే టైపు చేసి ఉంది. బాలికా పాఠశాల, భట్రాజుగారబ్బాయి, వెలగాడ కొండమీది నుంచి దృశ్యం వగైరా శీర్షికలన్నీ M.O. కు సంబంధించినవే.

M.O. కు సంబంధించిన కొన్ని రాతప్రతుల పుటలు మాత్రం ఇప్పుడు A.P. State Archives, Hyderabad లో భద్రపరచబడి ఉన్నాయి. బాలికా పాఠశాల, భట్రాజుగారబ్బాయి, వెలగాడ కొండమీది నుంచి దృశ్యం వగైరాల రాతప్రతులు ఇప్పుడు లభిస్తున్నాయి. కనుక దీన్ని బట్టి మిగతా శీర్షికలకు సంబంధించిన మాతృకలు కూడా ఉండేవని, ఆ రాత ప్రతుల ప్రాముఖ్యాన్ని ఎరగకపోవడంవల్ల, వాటిని handle చేసిన వ్యక్తుల అజాగ్రత్తవల్ల ఆ పుటలన్నీ కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని మనం భావించవచ్చు.

గోపాలకృష్ణ వీటన్నింటిని, ముట్టుకుంటే పొడిపొడి అవుతున్న టైపుకాగితాలను శ్రద్ధగా కాపీ చేసి, అచ్చుకు ఒక ప్రతిని తయారు చేసి ఉంచారు. ఆయన చనిపోయిన తర్వాత, వాళ్ళ అబ్బాయిలు ఇంట్లో దొరికిన కాగితాలన్నీ సేకరించి నాకు చేర్పించారు. ఆ టైపు కాగితాల మీద ఆయా శీర్షికలకు సంబంధించినంతవరకు పుటల సంఖ్య ఉందిగాని, మొత్తం M.O, H.H. శీర్షికలను గురజాడ ఏ క్రమంలో రాసి పెట్టారో తెలుసుకునే అవకాశం లేక పోయింది. శీర్షికల సారూప్యతనుబట్టి నాకు స్ఫురించిన వరుసలో అమర్చడమే చేయగలిగినది. మరికొన్ని M.O., H.H. కు సంబంధించిన టైపు పుటలు జారిపోయి లేదా misplace అయి నా దృష్టిలోకి వచ్చిఉండకపోవచ్చు కూడా. గోపాలకృష్ణ దృష్టి నుంచి తప్పించుకొన్న కొన్ని శీర్షికలు ఇందులో చేర్చడం జరిగింది.