పుట:Gurujadalu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లుబ్ధావ: వూరికి వెళిపోయినారు.

పంతులు: (ఆశ్చర్యము, కోపము, ముఖమున గనపరచుచు) ఏమిటీ రూపాయిలిచ్చి వెయ్యలేదు గదా?

లుబ్ధావ: సీదాగా యిచ్చివేశాను.

పంతులు: అన్న కొంపతీశావు మరేమిటి? ఇదంతా నీ కుట్రలాగ కనపడుతుంది. నువ్వూ వాడూ ఒకటైపోయినారు. యింతా నన్ను మధ్యవర్తినిచేసి నేను లేనిదీ ఈ వ్యవహారము ఏలాగు పైసలు చేసినారయా. ఈ వివాహంకోసం అష్టకష్టాలుపడి చమటూడ్చి పనిచేస్తే నేను లేకుండా ముహూర్తం జరిగినదా? ఇంత అమర్యాద నన్నెవ్వడూ చేయలేదు, దాని సంగతి నీకే తెలుస్తుంది.

లుబ్ధావ: నేను యేమీ చెయ్యలేదండీ మామగారూ, మీ పాదాలుసాక్షి, యేతప్పువున్నా క్షమించ వలసినది (అని కాళ్లుముట్టును.)

పంతులు: యీ గుంటూరిశాస్త్రుల్లు పచ్చపుదొంగలా కనపడుతున్నాడు. రూపాయలు పట్టుకుని వుడాయించాడు. పెళ్లి ఖర్చుకని నా దగ్గిర యాభై రూపాయలు బదులుకూడా పుచ్చు కున్నాడు. యీ వాళకమంతా చూస్తే వీడు యేదో పెద్దదగా చేసి నీలిచివుంటే యెక్కడ తెలిసిపోతుందో అని డబ్బు సంధించుకుని వుడాయించినట్టు కనపడుతుంది.

లుబ్ధావ: ఆయన రేపు సాయంత్రంలోగా రూపాయలు అప్పులవాళ్లకు చెల్లించకపోతే భూములు పోతాయని ఊరికే తొందరపడ్డాడు.

రానుప్ప: నువ్వు తెలివిహీనుడివి. నీకు వాడి సంగతి బోధపడకయినా వుండవలె. లేకుంటే నీవూ వాడూ కలిసి నన్ను టోపీ వెయ్యడముకు కుట్రైనాచేసి వుండవలెను. నా యాభై రూపాయలు నిష్కారణంగా పోయినాయి. నేను వూరుకునేది లేదు. బాగా ఆలోచిస్తే యీ పిల్ల రెండో పెళ్లి పిల్లలాగ కనబడుతున్నది. కనిస్టేబులను పిలిచి కేసు చేయిస్తాను. నేను యెప్పుడూ యింత దగాపడలేదు. యెవరోయి, హెడ్డుగారిని పిలువు.

లుబ్ధావ: యేదో కార్యమైపోయింది. మీ యాభైరూపాయలూ నేనిచ్చుకుంటాను. నా పరువు నిలబెట్టండి. రసాభాస చెయ్యకండి. మీరెలా చెపితే అలాచేస్తాను.

రామప్ప: ససేమిరా! నేనెంతమాత్రమూ వూరుకోజాలను. నా దగ్గిరే స్వామిద్రోహం చెయ్య డమా?

లుబ్ధావ: క్షమించండి (కాళ్లుపట్టుకొనుచున్నాడు. )

దగ్గిరున్నవారు: లుబ్ధావధానులుగారు నిరపరాధీ తమరేలాగైనా గడుపుకోవాలి.

రామప్ప: ...యేవూరు వెళ్లారో తెలుసునూ?

గురుజాడలు

170

కన్యాశుల్కము - తొలికూర్పు