పుట:Gurujadalu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కరటక : నా రూపాయిలిచ్చి మరీ స్నానంచెయ్యండి.

లుబ్ధావ: బాపన్నగారూ : ఊసంచి పట్టుకొండి. మధ్యవర్తులు గనుక మంగళ సూత్రధారణ కాగానే మీరే యిచ్చీ వెయ్యండి.

కరటక: పుస్తె కట్టడంకాగానే బయలుదేరి నేను వెళ్లిపోవలెను. రేపు రూపాయిలు చెల్లకపోతే భూములు నిష్కారణంగా పోతాయి. ఎల్లుండి ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను. ఈలోగా పిల్లది వక్కరై వంటరిగానుంటుంది. మీదే భారము. (కరటకశాస్త్రి, మీనాక్షి, తక్క దక్కినవారు వెళ్లిపోవుచున్నారు. )

కరటక: అమ్మీ మీనాక్షి! పిల్ల దాన్ని యలాగ చూసుకుంటావో నేను నీకిస్తానన్న మొహురిదుగో పిల్లదాని స్నానం అదీ ఒక్క నిమిషములో అయిపోవాలి. (మీనాక్షి చేతిలో నొకమొహురు బడవేయును)

మీనాక్షి :మీకెందుకూ, నేనున్నాను కాదూ, వెళిపోవును.)


***

మూడవస్థలము - లుబ్ధావధానుల యింటిలో సావడి.

(పసుపు పంచలు కట్టుకొని, లుబ్ధావధానులు, యింకను మరికొందరును, ప్రవేశించుచున్నారు. తాషామరపా చప్పుడు వినబడును.)

పంతులు :(డాబుగా దుస్తువేసుకుని ప్రవేశించి) అబ్బ! ఎంత శ్రమ పడ్డానండీ.(నౌఖర్ల వైపుచూచి) బాజాలూరుకోమనరా వెధవ పెద్దీపాలెం ఎంతదూరమున్నదండీ. కాళ్లు పీకుకువచ్చాయి.

(అని కూరుచొనును.)

లుబ్ధావ : లగ్నానికి మీరు లేకపోయినారుగదా అనీ మహావిచారంగా వుంది.

పంతులు: (ఉలికిపడిలేచి) ఏమిటీ.... వివాహమయిపోయిందీ?

లుబ్ధావ :మీరు ముహూర్తం తెల్లవారిన తర్వాత నాలుగు ఘడియలకనుకున్నారు. పురోహితుడు: నాలుగు ఘడియల రాత్రుందనగా లగ్నమన్నాడు.

పంతులు: (పురోహితుని వైపుచూచి) నాతో స్పష్టంగా నాలుగు ఘడియల ప్రొద్దుకని చెప్పావు? నేను పెద్దమనుషుల్నాలాగు పిలుచుకువచ్చానుగదా వాళ్లేమనుకుంటారు? గుంటూరు శాస్తుర్లేడి?

గురుజాడలు

169

కన్యాశుల్కము - తొలికూర్పు