పుట:Gurujadalu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరీశ : స్కూళ్లలో అర్థం చెప్పరండి. పరీక్షకు అర్థం అక్కరలేదు. వేదం చదివినట్టె తెలుగూ చదివిస్తారు.

కరటక: (తనలో) తరిఫీత్ మా చమత్కారంగా వున్నది. వీడికి పెందరాళే ఉద్వాసన చెప్పితేనే గాని అసాధ్యుళ్లా వున్నాడు.

అగ్నిహో: బాగావుందండి మా వాడికి డబ్బు ఖర్చులేకుండా పెళ్ళి అయేసాధనం కూడా ఒకటి తటస్థించింది. ఇటుపైన కలక్టరీదాకా చదువుచెప్పిస్తాను.

వెంకమ్మ: మీ నైజం కొద్దీ ఛిర్రూ కొర్రూ మంటారు గాని మీకుమాత్రం బాబు మీద ప్రేమలేదా యేమిటి పట్నంలో గొట్టాలమ్మ వచ్చినప్పుడు బెంగబెట్టుకుని బాబుని శలవర్జీరాసి వెళ్లిపో రమ్మన్నారు కారా - పెళ్ళీ చెయ్యక చదువూ చెప్పించక తీరుతుందాయేమిటి.

కరటక: డబ్బుఖర్చు లేకుండా కొడుక్కు పెళ్ళి చేస్తావుటోయి బావా! పిల్లలను అమ్మినట్టె అనుకున్నావా యేమిటి? పదిహేను వందలైనా పోస్తేగాని పిల్లను యివ్వరు.

అగ్నిహో: రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావదాన్లుగారికి చిన్నమ్మిని పద్దెనిమిదివందల రూపాయీలకు అడగవచ్చినారు. ఆయన నాలుగు లక్షలకధికారష, ఉభయ కర్చులూ పెట్టుకుంటారష, పెళ్ళి మహావైభవంగా చేస్తారష, మనమే తర్లి వెళ్ళడం. తాంబూలం పుచ్చుకున్నారు. నిశ్చయం అయిపోయినది, ఆ పద్దెనిమిది వందలూ పెట్టి వెంకడికి పెళ్ళిచేస్తాను.

వెంకమ్మ: అయ్యో! అయ్యో! నాకు తెలియకుండానే? నాకు తెలియకుండానే? యెన్నేళ్ళేమిటి పెళ్ళికొడుక్కి

అగ్నిహో: ఎన్నేళ్లైతే నేమిటి నలభైయైదూ.

వెంకమ్మ: బుచ్చమ్మ మన జీవానికి వుసూరుమని యేడుస్తూంటే సుబ్బిని కూడా యెవడో ముసలి వెధవకు అమ్మ తల్చుకున్నారు. మేనరికము యివ్వాలని ఎంతో ముచ్చటపడుతూన్నాను. ఈ సంబంధము చేసుకుంటే నేను నూతిలో పడకమానను.

గిరీశ : లుబ్ధావధాన్లు మా పెత్తల్లి కుమారుడండి కాని సెల్లింగ్‌గర్ల్స్ కన్యాశుల్కము, డామిట్, యెంతమాత్రమూ కూడదు. అవధానులు మామగారూ. డామిట్ - మల్బారీ దాని విషయమై చాలా యస్సేస్ వ్రాసినాడు. నేను పూనాలో వున్నప్పుడు కన్యాశుల్కము విషయమై ఒకనాడు నాలుగు ఘంటలు లెక్చరిచ్చినాను. సావకాశంగా కూర్చుంటే కన్యావిక్రయము బహు దౌర్జన్యమైన పనని ఈచేత వొప్పిస్తాను.

కరటక: ఈ సంబంధము చేస్తే నీ కొంపకి అగ్గి పెట్టేస్తాను.

గురుజాడలు

141

కన్యాశుల్కము - తొలికూర్పు