పుట:Gurujadalu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్నిహో: వీళ్లమ్మా శిఖాతరగా! ప్రతి గాడిదకొడుకూ తిండిపోతుల్లాగచేరి నన్ను అనేవాల్లే! మరింతకాక యింత గింజుకుచచ్చేది యీ సంబంధం చెయ్యకపోతే నేను బారికరాముడే సరి.

(అని వెళ్ళిపోవును).

కరటక: ఏమి అపృచ్ఛపుమాటలంటావయ్యా.

వెంకమ్మ: అబ్బీ యీ సంబంధం చేస్తే నేను నూతులో పడకమానను. నలుగురు బంధువులలో పరువూ ప్రతిష్టా పోవడం సరేగదా అమాంతంగా పిల్లదాని పీక కోసివెయ్యడం కాని మరివకటి కాదు. పెద్దదానిని పక్కలో కుంపటిలాగు ఇంట్లో పెట్టుకు అనుభవిస్తూనే వున్నాము. ఆయనకి మంచీ చెడ్డా వొళ్లునాటక ఈ దౌర్భాగ్యపు సంబంధం కల్పించినారు. ఆయన చదువులూ నా నోములూ యెందుకు. తగలేయనా, ఆయనకు యెంతతోస్తే అంతేకాని కావలసిన వారిని సలహాచెయ్యడం అదీ యెప్పుడూ లేదు. ఇంతెందుకూ ఈ సంబంధము అయినట్టాయనా ఒక నుయ్యో గొయ్యో చూచుకోవడమే కాని మరి సాధనం లేదు.

కరటక: (ఆలోచించుచు నిమ్మళముగా) గట్టి అసాధ్యము వచ్చినది - వొట్టి మూర్ఖపు గాడిదకొడుకు యెదురు చెప్పితే మరింత కొర్రెక్కుతాడు. యేమీ పాలుపోకుండావున్నది.

గిరీశ : వెంకమ్మత్తగారూ మీరెందుకాలాగు విచారిస్తారు. సావకాశముగా మామగారు ఒక్క ఘంట కూర్చుంటే కన్యాశుల్కమూ, శిశువివాహమూ కూడదని లెక్చరు ఇచ్చి ఒక నిముషములో ఆయన మనసును మళ్ళించి వేస్తాను.

కరటక: (తనలో) నీవు వొక ఘంట లెక్చరు యిస్తే నీ వంటిమీద అతను రెండు ఘంటలు లెక్చరు ఇస్తాడు. (బిగ్గరగా) అమ్మీ నేనొక సలహా చెపుతాను యీలాగురా. (ఇద్దరును వెళ్ళిపోవుచ్చున్నారు)

గిరీశ : మైడియర్‌ షేక్‌స్పియర్ ! మీఫాదర్ అగ్గిరాముడోయి, మీ ఇంట్లో యెవళ్ళకీ అతనిని లొంగదీసే యలొక్వెన్సు లేదు. నా దెబ్బ చూడు యీవేళ యేమిచేస్తానో. వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్కము విషయమై వ్రాసిన పాంప్లెట్ ట్రంకులోనుంచి తియ్యి. మామగారికి లెక్చర్లు ఇవ్వడానికి కత్తీ ఖటార్నూరాలి.

వెంకటే: మీ లెక్చరు మాట అలాగుండనీండిగాని యీవేళ నాగండము గడిచినది గదా అని సంతోషిస్తూన్నాను. మీరు రాకపోతే మా తండ్రి పెయ్యకట్టుతాడు పట్టుకుని పరీక్ష ఫెయిల్ అయినందుకు చెమడాలు యెక్కకొట్టి వేసును. క్రిందటి మాటు కిసిమిసు శ్శలవులలో తిన్నదెబ్బలు యిప్పటికి మరిచిపోలేదు.

గురుజాడలు

142

కన్యాశుల్కము - తొలికూర్పు