పుట:Gurujadalu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేను యేదో ఉద్యోగాలూ ఊళ్ళు యేలి తనతో వైభవము వెలిగిస్తాననే నమ్మకముతో ఉన్నది, పూర్‌ క్రీచర్‌ !

Oh! Whistle to me and I will come away, Though father mother and grandmother. Should go mad.

ఎవరా వస్తూ ఉన్నది? నా ప్రియశిష్యుడు వెంకటేశ్వరులులాగు వున్నాడు. ఈ వేళ కిస్‌మిస్‌ శలవులు యిచ్చివుంటారు. వాడి ముఖం వైఖరి చూస్తే ఫెయిలయినట్టు కనపడుతున్నాడు. వీడికి శలవులలో చదువుచెప్పే మిషమీద వీడితోకూడా వీడి వూరు వుడాయిస్తే చాలా చిక్కులు వదులుతవి. అటు నుంచి నరుక్కురమ్మన్నాడు.

(వెంకటేశ్వర్లు ప్రవేశించుచున్నాడు)

గిరీశ: ఏమివాయి, మైడియర్‌ షేక్స్‌పియర్‌. ముఖం వేల వేసినావు?

వెంకటే: ఇక మీరు నాతో మాట్లాడకండి, మీతో సావాసం చెయడముచేత నా పరీక్ష పోయిందని మా మేష్టరుగారు చెప్పినారు.

గిరీశ: నాన్సెన్స్‌. మొదటినుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మేష్టరుకి నన్ను చూస్తే కిట్టదు. అందుచేత నిన్ను ఫెయిలుచేసినాడు గాని; లేకుంటే నివ్వు ఏమిటి? ఫెయిలు కావడమేమిటి! అతనికీ నాకూ యెందుకు విరోధము వచ్చిందో నీకు తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పేపరులో పెట్టి యేకివేసినాను.

వెంకటే: మీవల్ల నాకు వచ్చినదల్లా చుట్టకాల్చడం వక్కటె. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడమేకాని, ఒకమాటయినా ఒక ముక్క చెప్పిన పాపానపోయినారా?

గిరీశ: డామిట్‌. యిలాంటి మాటలంటే నాకు కోపము వస్తుంది. ఇది బేస్‌ యిన్‌గ్రాటిట్యూడ్‌. నాతో మాట్లాడుతుండడమే యెడ్యుకేషన్‌ . నీకున్న లాంగ్వేజి నీ మేష్టరుకైనా వుందీ? విడో మారేజి విషయమై, నాచ్ కొశ్చన్‌ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను. నా దగ్గర చదువుకొన్నవాడు ఒకడూ అప్రయోజకుడు కాలేదు. పూనాలో డక్కన్ కాలేజిలో నేను చదువుతున్నప్పుడు ది ఇలివెన్ కాజెస్‌ ఫర్ ది డిజెనరేషన్‌ ఆఫ్‌ ఇండియా విషయమై మూడు ఘంటలు ఒక్క బిగిని ఆలాగు లెక్చర్లు యిస్తే ప్రొఫెసర్లు అంతా టర్రు కొట్టేశారు. మొన్న బంగాళీబాబు ఈ వూళ్ళో లెక్చర్లు యిచ్చినప్పుడు ఒకడికయినా నోరుపెగిలిందీ. మనవాళ్లు వట్టి వెధవాయిలోయి. చుట్టకాల్చడం యొక్క మజా నీకేమీ బోధపడలేదు. చుట్ట కాల్చడం నించే దొర్లు యింత గొప్పవాళ్లు అయినారు. చుట్టకాల్చని ఇంగ్లీషు వాడిని చూశావూ? చుట్టకాల్చడంబట్టె స్టీముయంత్రం కనుక్కున్నారు. శాస్త్రకారుడు కూడా యేమన్నాడో వినలేదా?

గురుజాడలు

132

కన్యాశుల్కము - తొలికూర్పు