పుట:Gurujadalu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

                       క. ఖగపతి యమృతముతేగా ।
                           భుగభుగమని పొంగి చుక్క భూమినివ్రాలెన్‌ ।
                           పొగచెటైజన్మించెను ।
                           పొగతాగనివాడు దున్నపోతైబుట్టున్॥

ఇది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసములో వున్నది. అది అలాగు వుణ్ణీగాని నీ అంత తెలివయిన కుర్రవాడిని ప్రొమోషన్ చెయ్యనందుకు నీ మేష్టరుమీద నావళ్లు మహామండుతూ వున్నది. ఈమాటు వంటరిగా షికారు వెళ్ళుతూన్నపుడు చూచి ఒక తడాఖాతీస్తాను. నీవు శలవులలో యిక్కడ వుంటావా లేక, వూరికి వెళతావా?

వెంకటే: మా వూరికి వెళ్ళాలనివుంది కాని (గద్గద స్వరముతో) ప్యాసుకాలేదంటే మా వాళ్ళు కొట్టేస్తారు.

గిరీశ : నీకు నేనొక వుపాయం చెప్పుతాను. నేను చెప్పినట్టల్లా యెప్పుడూ వింటానని ప్రమాణకం చేస్తావా?

వెంకటే: (అతనికాళ్ళు పట్టుకుని) ఏలాగైనా నన్ను రక్షించాలి మా నాన్నకు మా చెడ్డకోపం. ఇంటికి వెళ్లితే యెముకలు విరగగొట్టేస్తాడు.

గిరీశ : దట్ యీస్ టిరనీ యిదే బంగాళీ కుర్రవాడవుతే యేమిచేస్తాడో తెలిసిందా? కర్ర పట్టుకుని తండ్రయేది తాతయేది ఛమ్డాలు యెక్కకొడతాడు. మీ అగ్రహారంలో మరి యెవరూ స్కూలు కుర్రవాళ్లులో లేరుగద?

వెంకటే: లేరు

గిరీశ : అయితే నేనొక వుపాయం చెప్తాను విను. నేను కూడా నీతో వస్తాను. నువ్వు ప్యాస్ అయినావని చెప్పేదాము. కావలిస్తే అటుంచి వచ్చిన తరువాత టవును స్కూలులో ప్రవేశించవచ్చును.

వెంకటే: మీరు కూడా వుంటే నాకు భయములేదు, మొన్న వేసంగి శలవులలో కూడా మా అమ్మ శలవులలో పాఠాలు చెప్పడానికి మిమ్మలిని తీసుకురమ్మంది.

గిరీశ : ఆల్‌రైట్. కాని నా కిక్కడ చాలా వ్యవహారములలో నష్టము వస్తుంది. మునసబుగారి కొమాళ్లకి శలవులలో పాఠాలు చెప్పితే ట్వంటీ రుపీస్ యిస్తామన్నారు. అయినా నీ విషయంలో యెంత లాస్‌వచ్చినా నేను కేర్ చెయ్యను. మీవాళ్లు బార్ బరస్ పీపిల్ తిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో. నీవు నా విషయమై గట్టిగా రికంమెండు చెయ్యవలసియుంటుంది. కొత్త పొస్తకాలు కొనడమునకు ఒక జాబితావ్రాయి కొంచెము

గురుజాడలు

133

కన్యాశుల్కము - తొలికూర్పు