పుట:Gurujadalu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్యాశుల్కము

మొదటియంకము

స్థలము - విజయనగరములో బొంకులదిబ్బ

(గిరీశం ప్రవేశించి.)

గిరీశ: సాయంకాలమైనది. పూటకూళ్లమ్మకు సంతలో సామాను కొనిపెట్టుతానని నెల రోజులైనది పదిరూపాయలు పట్టుకువెళ్ళి డ్యాన్‌సింగు గర్లుకింద ఖర్చు పెట్టినాను. యీవేళ ఉదయము పూటకూళ్లమ్మకూ నాకూ యుద్ధము అయిపోయినది. బుర్ర బద్దలుకొడదామా అన్నంతకోపం వచ్చినది కాని, పూర్ రిచ్చర్డు చెప్పినట్లు పేషన్సు వుంటేనే కాని లోకములో పనిజరగదు.

When lovely woman stoops to folly,

And finds too late that men betray,

What charms can soothe her melancholy,

What arts can wash her guilt away?

ఈలా డబ్బు లాగేస్తే యిదివరకు యెన్ని పర్యాయములు ఊరుకున్నదికాదు. డ్యాన్‌సింగు గర్లు మాట యేదో కొంచెము ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. లేక యెవళ్లయినా నా మీద కోపంకొద్దీ ఉన్న నిజం దానితో చెప్పివేసినారేమో! ఈ వేళ ఉదయంసంగతి ఆలోచిస్తే యిటుపైని తిండిపెట్టేటట్టు కనపడదు. ఇక యీ వూరులో మనపప్పు వుడకదు. ఎటుచూచినా అందరికీ బాకీలేను. వెంకుపంతులుగారి కోడలికి లవ్‌‌లెటర్‌ వ్రాసినందుకు యెప్పుడో ఒకప్పుడు సమయంచూసి యెముకలు విరగ్గొట్టేస్తారు.

Can love be controlled by advice?

Will cupid our mothers obey?

శీఘ్రంగా బిచాణా యిక్కడనుండి యెత్తివెయ్యడమే బుద్ధిమంతుడికి లక్షణం. గాని మహాలక్ష్మిని వదలడమంటే యేమీ మనస్కరించకుండా వున్నది.

It is women that seduce all mankind.

గురుజాడలు

131

కన్యాశుల్కము - తొలికూర్పు