సంఘసంస్కరణము చేయవలెననిన విద్యావిధానములో గూడ మార్పులు జరుగవలెను, జాతీయ బాధ్యతలను గుర్తించిన దేశములవారు అతిశీఘ్రముగానే సంఘస్థితిని సవరింపగల్గుదురు. రషియా దేశమున సంఘ సంస్కరణముతో పాటు విద్యాసంస్కరణము గూడ జరిగినది. అటులనే ఇటలీ, జర్మనీ దేశములలో గూడ విద్యావిధానమున చాల మార్పులు జరిగినవి. దేశముననున్న ప్రజల కందరికి సమాన అవకాశ మొసంగుటే నవీన సాంఘిక ఆశయము. ఇందులకు ప్రజలందరు పనిచేయవలెను. మానవసంబంధములు మారవలయును. “ఇటుపైని ప్రపంచము నివాసయోగ్యముగా నుండునట్లు విద్యావిధానము విద్యార్థులకు బోధించుట ముఖ్యతమము”. అని కొలంబియా విశ్వవిద్యాలయమునందలి డీ౯ రసెల్ గారు నుడివిరి. ప్రజల కందరికిని జ్ఞానమును కలుగజేయుటే గ్రంథాలయమున ముఖ్యకర్తవ్యము. ప్రజలలో నూతన జాతీయ జీవన, విజ్ఞానము నాగరకత మున్నగునని వృద్ధినొందవలెను. ఇప్పుడు మనకు అనుభవము గలదు. ప్రజలతో కలసిమెలసి తిరుగుటకు అవకాశములు గలవు. జ్ఞానమును బడయుటకును, సంఘసేవ చేయుటకును చాల అవకాశములు లభించును గాన మనము సంఘపునర్నిర్మాణమును చేయగల్గుదు మను గట్టి నమ్మకముతో పనిని ప్ర్రారంభింపవలెను.
గ్రంథాలయములకు పుస్తకములు, పత్రికలు చేర్చినంత మాత్రమున వెంటనే మనము కోరిన ఫలితము కలుగదు. మనుష్యులకు సహజమగు విజ్ఞాన సంపదను వారు తెలిసికొనగల్గుటకు తగు విధానమును మనము బాగుగా యోచించి నిర్ణయింపవలెను. అందులకు గ్రంథాలయముల వారు చేయవలసిన పనుల వ్యాప్తి అధికము కావలెను. ప్రజలకు గ్రంథాలయముల యొద్ద పుస్తకములు నిచ్చుటయేగాక వీలున్నంతవరకు ప్రజలలో సద్వర్తనము కలుగ జేయుట ఇప్పుడు ముఖ్యావసరమై యున్నది. ఇందులకు గ్రంథాలయముల సంఖ్య చాలా అధికము కావలెను. గ్రంథములు, ఉపన్యాసములు, మాజిక్ లాంతరులు మున్నగు వాటివలన ప్రజలలో జ్ఞానమును అత్యధికముగా వ్యాపింపజేయవలెను. ఆంధ్రదేశమునందున్న 12 జిల్లాలలోను ప్రాథమిక పాఠశాలలో గ్రంథాలయముల నేర్చరచి, ఆరీతిగా వాటిని ఉపయోగించు కొనవలెను. 12 జిల్లాలలో 10,000 ప్రాథమిక పాఠశాలలున్నవి గావున 10,000 గ్రంథాలయముల నేర్పాటు చేయవచ్చును. పాఠశాలల ఉపాధ్యాయులు గ్రంథాలయోద్యమములు సరిగా నిర్వహింపగల్గుటకు వారికి తగిన అభ్యాసమును కలుగజేయ వలెను. ఈ గ్రంథాలయముల పరిపాలన బాధ్యతను జిల్లా బోర్డులకే వశపఱుపదగును. ఇటుల గ్రంథాలయ వ్యాప్తికి ప్రాథమిక పాఠశాలలను పునాదులుగా చేసుకొని కమక్రమముగా దాని నభివృద్ధి నొందింపవలెను. సంఘ సేవకు సంబంధించిన ఉద్యమములకు కావలసిన ధనమును సమకూర్చుటకు వ్యక్తులపై ఆధారపడగూడదు. ప్రభుత్వము వారు పన్నులను వసూలు చేయుచున్నారు. కావున విద్యా విషయమునను, శారీరక విషయమునను వారు ఎక్కువ సేవ చేయవలసి యున్నది. పాఠశాలలో చదువతగిన వయస్సుగల వారికి మాత్రమేగాక పెద్దవారికిని, మిక్కిలి చిన్న వయస్సు వారికిని గూడ జ్ఞానము