గూడ చాల అధికమైనది. ఆంధ్ర భాషలో చాల పత్రికలు బయలు దేరినవి. చవుకరకము గ్రంథములు చాల వెలువడినవి. ముద్రాశాలలు చాల హెచ్చినవి. స్త్రీలును, పురుషులునుగూడ గ్రంథములను మిక్కిలి హెచ్చుగా చదువుచున్నారు. ప్రజలలో విజ్ఞాన ప్రబోధము సాంఘిక రాజకీయ, మత, సారస్వతాది సకల విషయములలో గూడ స్థిరముగా నేర్పడినది.
భారత జాతీయత ప్రబలతమము. దాని వికసన మన్ని విధములుగా గోచరించుచున్నది. ఈ జాతీయోద్యమమున కనుబంధమగు గ్రంథాలయోద్యమాభివృద్ధికి కొందరు ఆంధ్రదేశమున తమ జీవితములను వినియోగించు చున్నారు. ఇటీవల ప్రారంభింపబడిన సంఘ సంస్కరణోద్యమము లన్నిటిలోను ప్రబలతమము. వీరు దీనికి ప్రారంభకులు. శ్రీ యుతులు సూరి నరసింహశా శాస్త్రి, అయ్యంకి వెంకటరమణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, వి.వి.శ్రేష్ఠి, నాళం కృష్ణా రావుగార్లు మున్నగువారు పెక్కు మంది గ్రంథాల యోద్యమాభివృద్ధి కత్యధికముగా కృషి సలుపుచున్నారు.
ఈ యుద్యమము బాగుగా కొనసాగినచో మన దేశమునందలి కోట్లకొలది ప్రజలస్థితి చాల అభివృద్ధి నొందును. కాన నిది ముఖ్యమగు ప్రజాసేవయే యగును. ఐరోపా మహా సంగ్రామము ముగిసిన పిమ్మట కొంత కాలము వరకు ప్రపంచమున శాంతి కలుగకపోవుటచే ప్రపంచమునం దంతటను విజ్ఞాన, రాజకీయ, ఆర్థికాది విషయములను గూర్చి ప్రబల తమమగు నాందోళనము తల సూపినది. వివిధ దేశములవారు కలిసి ఆలోచించి పని చేయుటకు అవసరమగు సమత్వమును కలిగించుటకు చాలమంది నిరంతరాయముగా పని చేయుచున్నారు. ఒకరి నొకరు చంపుటకు మాత్రమేగాక నూతన విధమగు స్వాతంత్య్రము బడయుటకు గూడ వివిధజాతులవారు తపించు చున్నారు. ఈనాటకమునందు మనము గూడ చాల ఆసక్తిని కలిగియున్నాము. ఏలననగా మన భావి చరిత్రకు మార్గదర్శక మగునని పవిత్రభావమును మనము కాపాడుకొన గోరుచున్నాము. భావికాలమున ధర్మసమ్మతమగు సాంఘికవిధాన మేర్పడ గలదని తలంచు చున్నాము. దానిలో మన సాంఘిక ఆశయములును, ఆధ్యాత్మిక రత్నములును చేర్పబడగలవు. అట్టి విఖ్యాతమగు నాగరకత యొక్క లాభమును మనముగూడ పూర్తిగా బడయ గోరుచున్నాము. కాని అతినీచములు, హానికరములు అగు సాంఘిక దురాచారములను ముందుగా మనము తొలగింప వలసియున్నది. ఈ విషయమున గ్రంథాల యోద్యమము చాల పనిచేయవలెను. సత్యనిరతులై వివేకముతో పని చేయుచు ధర్మనిరతులగు పౌరులుగా నుండి మానవసేవ చేయగల్గునట్టి స్త్రీలును, పురుషులును చాలమంది ఏర్పడుటకు తగిన విధానమును మనాయకులు సిద్ధపఱుపవలెను. సంఘమునకు మేలు కలుగు నిమిత్తము వ్యక్తులు స్వార్థ త్యాగం మొనరించుట ముఖ్య సిద్ధాంతము. అటుపైని సంఘమునందు అన్ని తెగలవారికిని సరియైన న్యాయము జరుగవలెను. ఇపుడున్న అగ్ర అంత్య విభేదము లంతరించవలెను. ప్రస్తుతము మన దేశమున సాంఘిక సమస్య క్లిష్ట రూపమును దాల్చినది.