17 వ ఆంధ్రదేశ గ్రంథాలయమహాసభ
24, 25 డిసెంబరు, 1934
17 వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ డిసెంబరు నెల 24 వ తేదిన సాయంకాలము మద్రాసు నగరమున కాంగ్రెసు మందిరమున సమావేశమయ్యెను.
అన్నామలై విశ్వవిద్యాలయ మందు ఆర్థికశాస్త్ర పండితులగు డాక్టరు బి.వి.నారాయణస్వామిగారు ఈక్రింది ప్రారంభోపన్యాసమిచ్చిరి.
మన దేశమున ప్రజల విద్యావిహీనత బ్రహ్మాండమగు సమస్యగ నున్నది. దీనిని నివారించుటకు నిరక్షరాస్యులను అక్షరాస్యులనుగ నొనర్పవలసియున్నది. అల్పవిద్యారం భకులగు ప్రజలు దానిని మరచిపోయి తిరిగి అవిద్యాంధకారమున బడిపోకుండ కాపాడవలసి యున్నది. కాయకష్ట మొనర్చి జీవనోపాధిని సంపాదించు కొనవలసియున్న వ్యవసాయకులకును, ఇతర పాటక జన సామాన్య మునకును, పాఠశాలల కరిగి విద్యాభ్యాస మొనర్పగల శక్తిగాని, సావకాశముగాని లక్ష్యముకాదు. అట్టివారికి వినోదకరములును ఉత్సాహజనకములును అగు గ్రంథములు, గ్రంథ పఠనము నందభిరుచిని గలిగించి విద్యోపార్జనాసక్తుల నొనర్పగలవు. విద్యా భ్యాసమునకు రాత్రి పాఠశాలలకుగాని, ఇతర వయోజన విద్యాశాలలకు గాని చనువారి కవి మరింత ప్రోత్సాహకరముగ నుండగలవు. కొద్దికాలములోనే మన దేశమున గొప్ప రాజ్యాంగ సంస్కరణలు ప్రారంభింపబడుచున్నవి. ఆసంస్కరణలు జయప్రదమగుటకు వోటరులు, వ్యవహార పరిస్థితుల నెరిగి, దేశీయ సమస్యల బాగుగ దెలిసిన వారై యుండవలెను. అపుడుగానీ వారు, తమవోటింగు హక్కును వివేకముతో నుపయోగింపజాలరు. ప్రజలలో విద్యావ్యాప్తి కలుగుటవలన, పరిశ్రమలును, పరిశ్రమలయందలి కార్మికుల శక్తిసామర్థ్యములును అభివృద్ధి గాంచును. ఆ విధముగ గ్రంథాలయోద్యమము, దేశ పారిశ్రామికాభివృద్ధికి గూడ చాల సాహాయ్య మొనర్చినడగును. విద్యావంతులగు ప్రజలు, తమపౌర విధులను పౌరధర్మములను, పారిశుద్ధ్య విధులను బాగుగ గుర్తెరుంగగలరు. ఈ విధముగ ప్రజలు తమ రాజకీయ బాధ్యతల గూడ సరిగ నిర్వహించుకొనగలరు. ప్రపంచమునందలి నాగరక దేశములన్నిటి యందును - ప్రజలిపుడు, గ్రంథాలయోద్యమము యొక్క ప్రాముఖ్యమును బాగుగ గుర్తించియున్నారు. ఆంగ్ల దేశమున నూరుసంవత్సరములకు పూర్వమే గ్రంథాలయోద్యమము ప్రారంభింపబడెను. అప్పటినుండియు ప్రభుత్వసాహాయ్యముతోడను, ప్రజల ఉత్సాహ కార్యదీక్షుల వలనను గ్రంథాలయోద్యమమా దేశమున బాగుగ వ్యాపించెను. గత శతాబ్దమందు రెండవయర్ధ భాగమున నార్వే, స్వీడన్, డెన్మార్కు, ఫ్రాంసు, జర్మనీ దేశములు ప్రజోపయోగమునకు గాను గొప్ప గొప్ప గ్రంథాలయములను