Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

నిజమైన గ్రంథకర్త.

కాని ప్రతిభాశాలియైన గ్రంధకర్త యెన్నఁడును నిరుత్సాహమును జెందక, పట్టుదలయు, నభిని వేళమునుగలిగి నిరంతరకృషిచే నట్టిశత్రువుల కందనివాఁడై యున్నత స్థానమును జేరి పరమానందమును బడయుచుండును. సత్యానురక్తి, ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము,ఆత్మశిక్ష జితేంద్రియత్వము, నిరంతరపరిశ్రమ, అభినివేశము, సాహసము, ధైర్యము గలిగియుండునట్టి ప్రతిభాశాలియైన గ్రంథకర్త పామరజనాను రాగమునకై యుత్తమగుణములను గోల్పోవఁజూడఁడు. ప్రపంచమును దనవెంట నీడ్చుకొనిపోవఁ జూచును కాని ప్రపంచము వెంటఁ దాను బఱుగిడఁజూడఁడు. ఇట్టిశక్తులు లేనివాఁడు గ్రంథరచనమునకు దిగరాదు. దిగినను నిష్ప్రయోజనము.

"క.

నేరిచి సుకవికృతిచే
బేరెఱిఁగించుకొని జగతిఁ బెంపగుటొప్పుకో
నేరక కృతి చెప్పుటతగ
నేరమియపకీర్తి జగతినిలుపుటకాదే!


క.

"ఏరసము జెప్పఁబూనిన
నారసమాలించువాని నలరింపని యా
నీరసఁపు కావ్యశవముల
దూరముననబరిహరింపుదురునీతిజ్ఞుల్."


చ.

"ఫణతుల రెంటమూఁట నొక
        పద్యముఁ గూర్చెడివారు లక్ష్యుల
క్షణసహకావ్యనిర్వహత
        చిత్రముగానియట్లపో
ఫణమణిమాత్రధారులగు
        పాము లసంఖ్యము గాక తత్ఫణా
మణివిధ విశ్వభూభృతి స
        మర్థుఁడు శేషుఁడుగాక కల్గునే.

అని పైపద్యములోఁ గవికర్ణ రసాయనకావ్యకర్త విస్పష్టములగు వాక్కులతోఁ బ్రతివాఁడును గ్రంథరచనమునకు దిగ రాదని సూచించియున్నాఁడు.

"Valuable energy is wasted by being misdirected. Men are constantly attempting without special aptitude, work for which special aptitude is indispensable"
అని జార్జి హెన్రీ లూయిస్ వక్కాణించుచున్నాఁడు. అన్ని ఁటికంటెను సారస్వత జీవన ముత్కృష్టమైనదనుటకు సందియములేదు. ప్రతిభాశాలియైన గ్రంథకర్త యొక్కఁడు మాత్రమే కష్టపరంపరలనుండి తప్పించుకొని, సానంబట్టిన మణివలెఁ బ్రకాశింపఁగలఁడుగాన ప్రతిభాశాలురుమాత్రమే సారస్వతమును స్వతంత్ర జీవనముగఁ జేసికొనఁదగియుందురుగాని యేవిధమైన విద్యాశిక్షణమును లేక యచ్చుకూటములు తేరగనున్నదికదాయని పాడు పొత్తములను రచించి ముద్రణము గావించి యదియొక జీవనోపాధిగఁ జేసికొనఁగోరువారు తుదకు నష్టమును బొందగలుగుదురే కాని లాభమును బడయఁజాలరు. ఎల్లవారును సద్గ్రంధకర్తను బ్రోత్సాహపఱుచుచు నసద్గ్రంధ కర్తల నిరుత్యాహపఱుచుచు నాంధ్ర సారస్వతము పరిశుద్ధమైనదానినిగఁ జేయుట విధ్యుక్త ధర్మమని వేఱుగనేఁ జెప్పనక్కరలేదు.

మనము చేయవలసిన పని.

ఆంధ్రసారస్వతముఁ బెక్కువిధముల నేఁడభివృద్ధి గాంచుచున్నను, సంస్కార మభిలషించుచున్నది. నేటికాలమున వందలకొలఁది నవలలు ముద్రింపఁబడుచున్నను గొన్నిట మృదుమధురమయిన శైలి మృగ్యమగుచున్నది. మన యాంధ్రులలో బ్రతిభాశాలురైన మేధావులుకొందఱాంధ్రసారస్వతమును జీవనాధారముగఁ జేసికొని సంఘమున కత్యావశ్యకములును, ఆరోగ్యప్రదములు నగు గ్రంథసముదాయము నుజ్జీవింపఁ జేయవలసియున్నది. అట్టి ప్రతిభాశాలురు బయల్వెడలినయెడల దేశభాషాభిమాను లెల్లరును వారికి సర్వవిధములఁ దోడ్పడి, యాంధ్రసారస్వతమున్నత స్థితికి వచ్చునట్టులను జేయుటయ గాక సారస్వతజీవనముగూడఁ బవిత్రమైనదనియు, సత్యావశ్యకమైనదనియు, బ్రోత్సాహపఱుపఁ దగినదనియు నాంధ్రలోకము గ్రహించునట్లు కృషి సల్పుట మనకెల్లకు ముఖ్యకర్తవ్యమని నివేదించుచుఁ బ్రస్తుత మింతటితో విరమించుచు న్నాడఁను.