Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జల్లకులలో నెక్కి యెల్ల వేళల విహరించుచు, బమ్మెర పోతరాజుదారిద్ర్యమును బరిహసించిన కవిసార్వభౌముఁడు శ్రీనాధునివంటివాఁడు సయితము వార్ధక్యమునఁ గష్ట పరంపరల పాలయినవిషయము శ్రీనాధక వికృతము లైన

"సీ,

కవిరాజుకంఠంబుఁ గౌగలించేనుగదా
       పురవీధి నెదురెండ పొగడ దండ
సార్వభౌమునిభుజా స్తంభమెక్కెనుగదా
       నగరివాకిటనుండు నల్లగుండు
ఆంధ్రనై పధక ర్త యంఘ్ర యుగ్మంబునఁ
       దగిలియుండెను గదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసముం జేత
       వియ్య మొందెనుగదా వెదురుగొడియ
   కృష్ణవేణమ్మకొనిపోయె నింతఫలము
   బిలబిలాక్షులు తినిపోయె తిలలుఁ బెసలు
   బొడ్డుపల్లెను గొడ్డేలిమోసపోతి
   నెట్లుచెల్లింతు టంకంబులేడునూర్లు."


"సీ,

కాశికావిశ్వేశుఁగలిసె వీరారెడ్డి
     రత్నాంబరంబు లేరాయఁడిచ్చుఁ
గైలాసగిరిఁబండ మైలారివిభుఁడేగా
     దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
రంభగూడె తెనుంగు రాయరాహుత్తుండు
     కస్తూరికేరాజుఁ బ్రస్తుతింతు
స్వర్గస్థుఁడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
     పాత్రాన్న మెవ్వనిపంక్తిఁగలదు
   భాస్కరుఁడు మున్నె దేవునిపాలికరిగెఁ
   గలియుగంబు-నిఁక నుండఁ గష్టమనుచు
   దివిజకి వివరు గుండియల్ దిగ్గురనఁగ
   నరుగుచున్నాఁడు శ్రీనాధుఁ డమరపురికి."

అను పద్యములలోఁ దెలుపఁబడియుండెను.

"రాబర్టు బరున్సు"

ఇట్లే ప్రసిద్ధిఁగాంచిన “రాబర్టు బరన్సు”యను నాంగ్లేయకవి యౌవన కాలమున గొప్పవారిచే సన్మానింపఁబడుచు వారిచేఁ గావింపఁబడువిందులం గుడుచుచు నుండియు, తుదకవసానకాలమున తన్నావఱకు గౌరవించి శ్లాఘించుచుండెడి తనతొంటిమిత్రులుపేక్షాపరులై, యొక్కరొక్కరే విడిచిపోవ "నైదుపౌను"లప్పీయవలసినదని యొక ప్రచురణకర్తను బ్రార్థింపవలసివచ్చినది. తన యౌవనమున దన్ను స్తుతించిన ధనాఢ్యులగు ప్రభువులందఱునేమైరి ? వారి సంబంధములు, వారి కార్యములు నెఱవేరినంతవఱకె. కుక్షింభరణార్థము స్తోత్రప్రియులైన ప్రభువులను ధనాఢ్యులను బొగడుచుండెడి కవులుకెప్పటికి సారస్వత జీవనమువలనఁ గలిగెడి నిజమైన సౌఖ్యము గలుగ నేరదు. కుక్షింభరణార్ధము తన యమూల్యమయిన స్వాతంత్ర్యామృతమును ధారవోసి, బానిసుతనమునలంకరించుకొను గ్రంధకర్తకు నిజమైన సౌఖ్యమెట్లులభించును ? మఱికొందఱు గ్రంధకర్తలు కుక్షింభరణార్ధము తమకృతినాధుల సంతోషపెట్టుటకై యోగ్యులైన సత్కవులెన్నఁడును, వినరాని కనరాని క్షుద్రవిషయములకుఁ దిగి తమశక్తులను భ్రష్టపఱచుకొనుచున్నారు.

గ్రంథకర్త కష్టములు.

ఇట్టివారివిషయ మటుండనిచ్చి, సారస్వతము జీవనముగాఁ జేసికొన్న సద్గ్రంధకర్తలకు కష్టములు లేవాయని యడుగవచ్చు. గ్రంధకర్తలకు ఆశాభంగములు, నిరుత్సాహములు, కష్టములు లేక యున్నయెడల వారు ఆనందముయొక్క విలువ యెటు తెలిసికొననగును? సుస్థిరచిత్తుఁడైన గ్రంథకర్త ఫలసిద్ధిని గోరువాఁడగునేని యెన్నఁడు నాశాభంగములకు, నిరుత్సాహములకు, నాటకములకు భయపడి వెనుదీయఁడు. అతఁడు వానినే విజయకారణములుగాఁ జేసికొనఁ జూచును. సారస్వతమునకు సేవఁ జేయఁబూనిన నిజమైన గ్రంధకర్త యుత్కృష్టాదర్శములను గలిగియుండు భాగ్యము వహించి యుండెనేని సౌఖ్యప్రదములయిన వస్తువులను వ్యర్థవ్యయములను దాంభికత్వమును విడిచి సులభ జీవనమున కలవాటుపడి, తృప్తిఁగాంచియుండును. పుష్టికరమైన భోజనము మెదటికీ చుఱుకుఁబుట్టింపఁజాలదు. ప్రతిభాశాలి లక్షాధికారిగఁబుట్టియుండలేదు. అసూయాపిశాచగ్రస్థులగు కువిమర్శకులవలన గ్రంధకర్తలకు మనస్తాపములు కలుగుచుండును. గొప్పతనమునుగోరి ముందుకు సాగివచ్చు ప్రతి గ్రంథకర్తకు నిట్టిపీడ కలుగుచునేయుండును.