Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిక్ష గాని, లోకానుభవము గాని, యోర్పుగాని లేక గ్రంధకర్తలకుండు బాధ్యతలను గుర్తెఱుంగక దుస్సాహసమునకుఁగూడ నొడిగట్టి చేతగాని పనులకుఁ|జేయిచాచి, తాము నష్టముఁ బొందుటయె కాక తాఁజెడ్డ కోతి వనమెల్ల జెఱిచినదన్నట్లు ప్రతిభాశాలురయిన గ్రంధకర్తల ప్రయుత్నములకుఁ గూడ నాశనమును గల్పించి, దేశమునకుఁ జేటు వాటిల్లురీతి వర్తింపసమకట్టుట శోచనీయము, మనదేశములో నెవ్వఁడేని సమర్థుఁడొకఁ వ్యాపారముకుజేసి, యావ్యాపారమునకై నానాకష్టములుపడి సమర్ధతతో దానిని నిర్వహించి కొంచెము లాభము బొందుట తటస్థమైనతోడనే యనేకులదివఱకు మాంద్యులైయుండియు, మఱియొక వృత్తికి దొరకొనక వానిపై పోటీకిబోయి, యావ్యాపారము నే చేయనవలంబించి, తామునష్టమును బొందుటయేగాక, లాభమును బొందుచున్న మొదటివానికి నష్టముగలిగించి, చెఱచుచుండుట, మనము కన్నులారఁ జూచుచున్నారము. సారస్వత విషయమునఁ గూడ నిట్టిచందములే గానం బడుచున్నవి. సారస్వత జీవనము కష్టసాధ్యము. మిక్కిలి పవిత్రవంతము. సుగుణాఢ్యులకు సులభసాధ్యము, దురాశాపాశబద్ధులకు దుస్సాధ్యము.నాల్గుపత్రము లల్లఁగల్గినవాఁడు కవియు, నాల్గుపత్రములు గీకినవాఁడు గ్రంధకర్తయుఁ గాఁజాలడు. సత్కావ్యములను రచించువారు సత్కవులు, సత్కవులసంవృత్తమును సంకుసాల నృసింహకవి కవికర్ణ రసాయనమున నిట్లభివర్ణించి యున్నాఁడు.

"చ.

“మనమునఁగొన్న నెవ్వగలు
        మాన్ని ఘటింతురకాండసమ్మదం
బనఘ కథాముఖంబున హి
        తాహితబోధ మొనర్తురింపుగా
గనుఁగొనుకంటె నద్భుతము
       గా నెఱిగింతు రతీంద్రియార్థముల్
ఘనమతులెల్ల వారికి న
       కారణబంధులు కారె సత్కవుల్"

ఇక్కాలమున నిట్టి సత్కవు లెక్కడనో గాని కానంబడరు. సత్కవులెట్టివారో సద్గ్రంధకర్తలు గూడ నట్టివారె యగుదురనుటకు సందియములేదు. నిష్కళంకమైన యోచన, సత్యమందనరాగము, కీర్తిప్రదమైన స్వేచ్ఛ వీనితోఁగూడుకొన్న దైనయెడల సారస్వతజీవనము తక్కినవానికన్న శ్రేష్ఠమైనదనుటకు లవమాత్రము సందియములేదు.

గ్రంథకర్తలు.

తనంతగ తానొక పక్షమునకు మొగ్గ నూహించినప్పుడుతక్క గ్రంథకర్త యెన్నఁడుము నొక మనుష్యునకుఁగాని, యొక స్థలమునకుఁ గాని, యొక పక్షమునకుఁ గాని వశుఁడు కాఁజాలఁడు. గ్రంథకర్తకు జనసామాన్యమైనను రాజాధిరాజైనను నొక్కటియె. గ్రంథకర్త యనేక ప్రజలను బరిపాలింప సమర్థత గలవాఁడు. అతనిశక్తి మహత్తరమైనది, ఆ ప్రతిమానమైనది. కనుక సారస్వత జీవనము తక్కినవానికన్న నధిక సంతోషకరమయినదిగానే నూహించెదను. అయినను గొందఱు నాయభిప్రాయముతో నేకీభవింపకపోవచ్చును. అట్టివారు సారస్వత జీవనముగలవారిలోనే పెక్కందుకలరని నేనెఱుంగుదును. అగ్ని మాంద్యముచే క_సిపడువారనఁగా మనోరథభగ్నులైన గ్రంధకర్తలు పెక్కండుగలకు. ప్రచురణకర్తలకు ననేక సంవత్సరములవఱకు నొడంబడికలు వ్రాయువారు శృంఖలములలో నృత్యములు సేయు వారి పగిది దుఃఖభోజనులగుచున్నారు. సారస్వత జీవనమువలనఁ గలుగవలసిన యానందము గలుగనేరదు. ప్రచురణకర్తలు తమ కృషికి నెంతప్రతిఫలము నొసంగుదురో యని యను దినమును తాను వ్రాసిన కాగితములను లెక్క పెట్టుకొనుచుండు గ్రంథకర్త యెన్నఁడును సుఖమనుభవింపఁ జూలఁడు. జనప్రవాహ మెట్లీడ్చిన నట్లుపోవుచు, నేఁడిచ్చట, రేపు వేఱొక్కచోట, నెల్లుండి మతొక్కచోట స్తుతి పాఠములంగనుచు, తిబ్బిబ్బులగుచు, అప్పటి కానందమును బొందఁగోరు గ్రంధకర్త దేవతా ప్రసాదమునకు దూరగుఁడై, తానెవ్వరితోఁ గలిసి మెలసి తిరుగఁదలంచెనో యట్టి గొప్పవారిచేతనే పరిత్యజింపఁబడి తుదకు కష్టకాలమునకు నసహాయుఁడై పరితప్తుఁడుగాక మానఁడు.

శ్రీనాధుని యవసానదశ.

మహారాజుల చెలిమిఁజేసి, బంగరుతూగుటుయ్యేలలో నూగుచు, హంసతూలికా తల్పంబుల శయనించుచుఁ