Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్న వెఱ్ఱిభయ మాకాలమున నుంటచేఁ గొందఱుకవులు భూషించియు, దూషించియుఁగూడ ధనహరించుచుండిరి. ఒకని గుఱించిన కీర్తి గాని యపకీర్తిగాని వ్యాంపిపఁజేయుటకు నీకాలమునందలి వార్తాపత్రికలవలె నాకాలమునందలి కవులు కారకులగుటచేత సాధారణముగా నెల్లవారును కవులకు భయపడుచు, శుభకార్యాదులలో కట్నములు కానుకలుగూడ చెల్లించువారుగ నుండిరి. ఎవ్వరు సన్మానింపకో వారిపై కత్తికట్టి, కలము చేఁబట్టి, చలము చేనొక దూషణ పద్యమును గాని గ్రంధమును గాని/వాసి దేశదేశములఁజాటు దుష్కవులు కూడ నుంటచే గ్రంధకర్త పదము భయంకరమైనదై యపకీర్తిపాలయ్యెను. సామాన్యులలో "గ్రంధకర్త" యనఁగా చెడుగు చేయువాఁడని యపార్ధమేర్పడినది. అతఁడు "గ్రంధసాంగుఁడు; మనవాఁడు గ్రంధకర్తయైనాఁడు" అనునవి చెడు పనులు చేయువారిని గూర్చి పలుకునట్టి వాక్యములుగానున్నవి.

గీర్వాణభాషాపండితులు.

ఇట్లే గీర్వాణభాషాపండితులు కొందఱు సామాన్య జనుల వేషభాషల నధిక్షేపించుచు నౌచితి నెఱుంగక ఛాందసులై పామరులతో సంభాషించునపుడు సయితము సంస్కృత పదాడంబరమును జూపుచుంట చేత సామాన్యజనులకు వారిభాష యర్థము గాక యుండెను. అందువలన సామాన్య జనులా గీర్వాణ పండితులను గర్వభూయిష్టులను గాఁ దలంచుచుండిరి. ఏతత్కారణము వలన గీర్వాణశబ్దమున కపార్థ మేర్పడినది. అతనికి గీర్వాణము బలిసిపోయినదనఁగా వానికి గర్వమతిశయించినదను నర్ధము స్ఫురించుచున్నది. ఎంతటి సద్వస్తువు నైనను సద్వినియోగమునకుఁ దేక దుర్వినియోగ పఱచుచున్న యెడల దానికుండు సహజ గౌరవము కూడ చెడుచుండుననుటకు పైవిషయములను తార్కాణముగఁ జూపవచ్చును. కాఁబట్టి గ్రంధకర్త శబ్దమునకట్టి యపార్ధమేర్పడినప్పుడు సారస్వత జీవనమునకు సంఘములో గౌరవ మెట్లేర్పడఁగలదు?

నవీన కాలమునందలి యభివృద్ధి.

కనుకనే మన దేశములో నింతకుఁ బూర్వము గ్రంధరచన యొకవృత్తిగాఁ బరిగణింపఁబడుచుండలేదు. ఆదిసద్వృత్తులలో నొక్కటి యనుమాట జనసామాన్యమునకుఁ దెలియకుండెను. ప్రస్తుతస్థితియొకింత పరికింతము. బ్రిటిషు ప్రభుత్వము మనదేశమునకు లభించిన నాటనుండి మనదేశములో ముద్రా యంత్రములు వెలసి ప్రాచీనాంధ్రగ్రంధములనేకములు ముద్రింపఁబడి కాక వెలలకు వేనవేలు విక్రయింపఁ బడుచున్నవి. వార్తాపత్రికల మూలమునను యేటేటను ముద్రాయంత్రములనుండి వెలువడు గ్రంధములవలనగు భాషాభివృద్ధి యగుచున్నది. స్వదేశోద్యమమువలన మన దేశమునకు; గలిగిన లాభము భాషోజ్జేననముని ముఖ్యముగాఁ జెప్పఁదగును, సర్వకళాశాలాధికారులు దేశభాషలనుద్ధరింప నుదాసీనులై యున్నను దేశమున గ్రంధప్రచారమునకై యనేక సమాజము లేర్పడి యేటేట బెక్కు గ్రంధములనచ్చొత్తించుచు దేశమున వెదఁజల్లుచున్నవి. ఆగ్లేయభాషావిశారదులైనవారు మాతృభాష పట్లవిముఖులు గాక యనేకులిప్పుడు మాతృభాషాభిజ్ఞులై యత్యంతోత్సాహముతో మాతృభాషా సేవకై గడంగుచున్నారు. పల్లెలలో సైతము గ్రంధభాండారములు వెలయుచున్నవి.

మార్పు కాలము.

శాస్త్రగ్రంధములు, చరిత్రగంధములు, నవలలు, నాటకములు, ముద్రాయంత్రములనుండి వెలువడుచు నొకరీతిగా నమ్ముడువోవు కాలమువచ్చినది. ఇదియొక మార్పుకాలము, ఈ కాలస్థితిని జూచి యనేకులాకర్షింపఁబడి గ్రంధరచనకుఁ బూరుకొని దానినే జీవనాధారమగు వృత్తిగఁ జేసికొనవలయునని సాహసించి ముందుకువచ్చుచుండుటచే భాషా ప్రపంచమున నొక గొప్పకలవరము జనించుచున్నది. దానిస్వరూపమిట్టిదని తెలిసికొనుట గ్రంధరచనకు దొరకొనఁబూనిన ప్రతిమనుష్యున కవశ్యకర్తవ్యమైయున్నది. గ్రంధకర్తలకు మాత్రమెకాదు. దేశక్షేమము నభిలషించి సారస్వతాభివృద్ధి కైపాటుపడుచున్నట్టి ప్రతిదేశాభిమానికిని కలవరస్వరూపమును దెలిసికొనుట విధియైయున్నది. ఈకలవరమే నేఁడీవ్యాసమును వ్రాయుటకు నన్నుఁ బ్రేరేపించుచున్నది.

ఈ కాలమునందలికవులు.

వస్తుస్వరూపమును సరిగా గ్రహింప శక్తులు లేక దురాశాబద్ధులై యనేకులు సరియైన భాషాజ్ఞానము గాని