Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

గా నిప్పించుచుండెడివారు. ఆపండితులు తమ పని ముగియఁగనే ఆగ్రంధములను మరల నిచ్చెడివారు. ఇట్లే మన ప్రస్తుత భాండాగారముల కంకురము భరతవర్షమున వేలకొలఁది వత్సరముల క్రిందనే యేర్పడినది,

ఇది నవీనయుగము. మానవప్రపంచము సర్వవిధముల నభివృద్ధినందుచున్నది. భావములు, శాస్త్రములు, తెలివి, నాగరికత దినదినము హెచ్చుచున్నవి. ప్రపంచ యాత్ర నీనూతన యుగ కళలం దెలియక చేయుట దుర్ఘటము. అందుకేమి చేయవలయును? గ్రంధములం బఠియించుటే. వివిధ విషయిక జ్ఞానముఁ గల్గించు కొనుటే, అందుకుఁదగిన సాధనము లేవి? గ్రంథ భాండాగారములే.

తక్కిన హిందూసామ్రాజ్యముతో పాటు మన యాంధ్ర దేశమును ఈవిషయమున వెనుకపడియే యున్నది. అయినను గొలఁదికాలము నుండీ మన యాంధ్రులు విశేష యుత్సాహముంబూని వీనిని స్థాపింప యత్నించుచున్నారని చెప్పుటకుఁ గొంత సంతసింపవలసియున్నది. దినదినమును ఆంధ్రపత్రికలలోఁ క్రొత్తభాండాగారములు జన్మించుచున్నట్లు చదువుచున్నాము. దేశమున నన్ని భాగములను ఈ యుద్యమము కదలుచున్నది. అయినను ఇంతవరకు మన దేశమున గొప్పవి అయిదారు కంటె హెచ్చుగా లేవు. బందరు, ఏలూరు, కాకినాడ వంటి పెద్దపట్టణములలోఁ గూడఁ దగిన భాండాగారములు లేకపోవుట చూడ మనమెంత దుస్థితియందున్నది తెలియఁగలదు, అయినను ఈలోపములను దొలఁగించుటకై ఆంధ్రదేశ పుస్తక భాండాగార సంఘము మొక దానిని గత సంవత్సరము స్థాపించినారని చెప్పుటకు నాకానందమగుచున్నది. కాని యిది యెట్టిపనిని జేయునో ముందు చూడవలసి యున్నది. ఈ సంఘమువారు సంవత్సరమునకొకసారి సమావేశమయి మంచి చెడ్డలను జర్చించకొనుటతోనే తృప్తినొందక కొందఱు సంచారకులను నియమించి యాంధ్రలోకమున వివిధ భాగములందున నీసదుద్యము నెడ ననురాగము జనించునట్లును భాండాగారములను స్థాపించునట్లును జేయింతురుగాక, మరియుఁ గొందరు గొప్పవారు పోఁగయి జమీందారులను బెద్దవారిని యాచించి కొంత ధనమును సంపాదించి మూలధనముగా నుంచి దానిపై వచ్చు డబ్బులోఁ గొంత భాగమును క్రొత్త భాండాగారముల కిచ్చుచుఁ బ్రోత్సాహము చేసిన మేలుగానుండును.

అమెరికా దేశమున భాండాగారములు మహత్కార్యముల నొనరించుచున్నవి. కొన్ని గ్రంధములను ముద్రించుచున్నవి. దీనికై కొన్నిటికి ముద్రణాలయములు కలవు. మఱికొన్ని రాత్రి పాఠశాలలు స్థాపించి బాలురకు బాలికలకు భాండాగారములు నెట్లుపయోగించుకొనవలసినది తెల్పుచున్నవి. పాఠశాలలందు, రచ్చచావడులందు, న్యాయస్థానములముందు, బజారులందు, జిల్లాసభలందు, మతసభలందు, రాష్ట్ర సభలయందు అన్ని చోట్లను భాండాగారముల తరఫున బయలు చేసిన కార్యనిర్వాహకులు ప్రత్యక్షమై భాండాగారోపయోగములనుద్ఘోషించుచు లోకమెల్ల భాండాగారములతో నింపుచున్నారు. బాలురను, బాలికలను ఆకర్షించు జక్కనియాటల భాండాగారావరణములలో నేర్పఱచి వారికిఁ జదువునందుఁ బ్రీతి కల్పించుచున్నారు. శాఖలను సాపించి సమీప స్తలములలో గ్రంధములు