30
మార్గమనియు, ఆచరణయోగ్యమనియు మాత్రము గ్రహించి యేతాలూకావారా తాలూకాయందిట్టి సంఘముల నెలకొల్పి విద్యనభివృద్ధిజేయ మిమ్మందర ప్రార్థించుచున్నది. కనుక గ్రంథ భాండాగారికులారా! మహాజనులారా !! చదువన నెట్టిదియో యెరుగక, చదువరులఁజూచి సిగ్గుఁ జెందుచు, తమ జీవితము నెట్లు గడుప వలయునో గ్రహింపక యుండు విద్యావిహీనులగు మీ దేశీయ సోదరుల దుస్థితిఁజూచి మీ చేతనై సంత సాయము జేయక మీరూరకుండవచ్చునా! ఎట్లూరకుండగలరు ? మీతోపాటాంధ్ర మాతృగర్భమున జనించి మీకన్న హైన్యస్థితి యందుండ, వారి హీనత్వమే మీ హీనత్వము కాదా? మనమందరమాంధ్ర మాతృ గర్భమునం దుద్భవించిన యేకోదరులమని తెలసుకొని, ఆంధ్రమాతృరక్తమే మన యెల్లర దేహములను బ్రవహించుచున్నదని యెఱింగికొని, యేకోదరత్వము,రక్త బాంధవ్యములకన్న మిన్నయగునది నున్నదియని గ్రహించినచో నిదియొక ఘనకార్యము గాదు. కావున మీ సోదరులై మీకన్న బీదలై, మీ దయాభిక్షములకు వేచియున్నట్టియు, నాశించియున్నట్టియు, విద్యావిహీనులకు నిరక్షరకుక్షులకు విద్యాదానముఁ జేయ గంకణము కట్టుకొని గ్రంథభాండాగారములు దేశమునకు నిజమగు నుపయోగవంతములుగా జేయుదురు గాక ! మఱల జరుగబోవు గ్రంథభాండాగార సభనాటి కిట్టి సంఘము లొండు రెండేని స్థాపింపబడి ప్రారంభవిద్యాభివృద్ధికి దోడ్పడుదురు గాక!
సత్తెనపల్లి హనుమంతరావు.
గ్రంధాలయములు.
శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్యగారు అంగలూరు బాలసరస్వతీ పుస్తక భాండాగార వార్షికోత్సవ సమయమునందిట్లు జెప్పిరి:
విద్యాశాలల వలెనే గ్రంధాలయములు ప్రాచీన కాలమునందు మన భరతఖండమునఁ జాలఁ గలవు. అవి చేసిన కార్యములు వర్ణనాతీతములు. కవియొక గ్రంథమును రచించును. భాష కెల్ల నొకే ప్రతియుండిన దానివలన లోకములో నెందఱకుప యోగముగల్గును? ఇప్పటివలె నప్పుడు ముద్రాలయములు లేవు. చక్కని కాగితములు లేవు. అచ్చు లేదు. అందుచే గ్రంధములు విశేషవ్యాప్తం గాంచెడివి కావు. అయినను మహాకవులయందుఁగల యాదరమునంజేసి పెక్కురు గ్రంధములను దాటియాకులపై వ్రాసి లేక వ్రాయించి పఠించుకొనుచుండెడివారు. ఆ గ్రంధములు వారికే యుపయోగించుచుండేవి. పోయిన మరల నట్టి గ్రంధములను సంపాదించుట దుర్ఘటమని యెఱింగి వారు పరులకా పుస్తకముల నిచ్చెడు వారు కారు. ఆయీ విషయములం గమనించి మన భరతఖండపుఁ బూర్వ రాజులు పెక్కు గ్రంధములను వ్రాయించి యొక భవనమున నుంచి చదువుకొనఁగోరు పండితుల కుచితము