Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుస్కాందపురాణవచనమువలనను, ఈరామాయణము సర్వాలంకారశాస్త్రలక్షణోపేత మై సకలభారతవర్షీయప్రత్ననూత్నవాజ్ఞ్మయగ్రంథసమితికి నిదానమై, సకలపురుషార్థప్రద మై విరాజిల్లుచున్నది. ఏతత్కథాశరీరసంబద్ధులగు రామలక్ష్మణభరతశత్రుఘ్నహనుమద్విభీషణాదిమహాపురుషులసచ్చరిత్రములు వినుట వలన మాతాపితృభక్తి, సోదరప్రీతి, జ్యేష్టానువర్తనము, లోకమర్యాదానువర్తనము, స్వప్రతిజ్ఞారక్షణాభినివేశము, శబ్దాదివిషయవిరక్తి, ఆశ్రితవాత్సల్యము, స్వామికార్యనిర్వహణతత్పరత్వము, స్వార్థపరతానివృత్తి, చిత్తశుద్ధి, పరోపకారబుద్ధి మొదలగు సద్గుణములు గలిగి లోకము సద్వృత్తము నేర్చికొనును.

వాల్మీకి యిట్టిలోకోత్తరమహాకావ్యరచనాపటిష్ఠత కాకరమైన తపోమాహాత్మ్యము, దివ్యజ్ఞానసంపత్తియుఁ గలవాఁడని ప్రసిద్ధి నొందుటయే కాక యితఁడు ఛందశ్శాస్త్రమున కొక క్రొత్తయుగమును గల్పించి యాశాస్త్రమున కత్యద్భుతపరిణామమును గల్పించెను.

మొట్టమొదట వైదికఛందస్సులను లౌకికసంస్కృతశ్లోకరచనకొఱ కుపయోగించినవాఁ డితఁడే ఇతనికిముందు శ్లోకములు లేవు. ఇతనికిఁ బూర్వు లగుమహర్షు లందఱు గద్యమునే వ్రాసి రనుటకు నీ క్రిందఁ గనఁబఱిచినరఘువంశశ్లోకముయొక్క హేమాద్రివ్యాఖ్యాన ముచితప్రమాణము—

"నిషాదనిద్ధాండజదర్శనోత్థశ్శ్లోకత్వ మాపద్యత యస్య శోకః.” (రఘు. స. 14.70.)


“వ్యా. చాండాలనిద్ధక్రౌంచమిథునదర్శనోత్థేన శోకేన చాండాలం యదా౽భర్తృయత్
తదాప్రభృతి వృత్తాని పద్యా న్యభవన్. పూర్వం తు వాక్యా న్యే వేతి శ్రూయతే.”

వైదికలౌకికఛందస్సులతారతమ్యవిమర్శన మతిలాభకరము గాన, వానిని వాల్మీకి యె ట్లభివృద్ధి నొందించెనో యాయంశ మిచటఁ గొంత చర్చించెదము.

అనుష్టుప్ఛందస్సునకుఁ బ్రత్యేకముగ నెనిమిదేసి యక్షరములు గల నాల్గుపాదము లుండును. వేదమునందును ఈరామాయణ ప్రయుక్తానుష్టుప్పు గలదు. దీని కుదాహరణము ఋగ్వేదసంహితలో

“ఆత్వా గ్రావా వద న్నిహ సోమో ఘోషేణ యచ్ఛతుః
దివో అముష్య శాసతో దివం యయ దివావసో.”

ఇందుఁ బాదమున కెనిమిదేసియక్షరముల చొప్పున నాల్గుపాదములకు ముప్పదిరెండక్షరములు సరిగ నున్నవి. అయినను వైదికానుష్టుప్చంద స్సగుటచే నీవర్ణములు దీర్ఘములుగను, నీవర్ణములు హ్రస్వములుగ నుండవలయు ననునియమము లేదు. కాఁబట్టి పై వైదికానుష్టుప్పు లిట్లుగాక యంతట నవ్యభిచరితముగ రెండునియమములతోఁ గూడియున్నవి. ప్రథమతృతీయపాదములలోని పంచమాక్షరము దీర్ఘముగను, ద్వితీయచతుర్థపాదములలోని సప్తమాక్షరము హ్రస్వముగ నుండవల