విధి నాచరించి నిజాశ్రమమునకుం బోయి సుఖాసీనుఁ డై తచ్ఛ్లోకభావమును శిష్యునకుఁ జెప్పుచుండ సత్యలోకమునుండి పరమేష్ఠి యచ్చటి కేతెంచి "ఓతాపసోత్తమా! మత్ప్రసాదవిశేషమున నీ కిట్లు సరస్వతి స్వతః ప్రాదుర్భావము నొందె, కావున నారదునివలన నీవు వినిన రామచరిత్ర మంతయు నీతపోమహిమచే నీకు గోచర మగును. కాన దాని నేతాదృశశ్లోకములచే సవిస్తరముగఁ జెప్పుము. లేశమయిన నీవాక్కున నసత్యముండదు.” అని చెప్పి తిరోహితుఁ డగుడు వాల్మీకి, శ్రీ రామాయణకావ్యరచనోద్యతుం డయ్యెను.
శ్రీరామజననము, విశ్వామిత్రయాగసంరక్షణము, సీతావివాహము, పట్టాభిషేకవిఘ్నము, రామవివాసనము, సీతాహరణము, వానరసేతుబంధము, రావణవధము లోనగు పూర్వరామచరిత్రము జరిగినకొంతకాలమునకుఁ దరువాతఁ దిరిగి రాముఁడు రాజ్యమును బాలించుచున్నసమయమున వాల్మీకి యీరామాయణమును రచించినట్లు రామాయణవచనప్రామాణ్యమువలననే కానవచ్చుచున్నది.
(రామా. బాల. 3.4-7)
ఈకథ జరిగిన కొంతకాలమునకు మహర్షి గ్రంథలేఖన మారంభించి మొదటియాఱుకాండములు వ్రాసి పిదపఁ గొంతకాలమునకు రామునిచే లోకాపవాదభీతివలన నరణ్యమునందు విడువఁబడిన గర్భవతి యగుసీత తనయాశ్రమముఁ జేరి యచట నామె కనినకొడుకు లగుకుశలవులు పెరిఁగి ద్వాదశాబ్దవయస్కు లయినపు డుత్తరకాండమును వ్రాసి గ్రంథమును ముగించి యాకుశలవులచే నీగ్రంథమును సాకల్యముగఁ జదివించిన ట్లీ క్రింద వ్రాసిన శ్లోకములవలనఁ గానవచ్చుచున్నది.
(బాల 3-35; 4. 1-4.)
వాల్మీకి రామునకు సమకాలికుఁ డని నిర్ణయించుటకు మన కింతకన్న దృఢతరప్రమాణ మెద్దియుఁ గానరాదు. వాఙ్మయచరిత్రమును విమర్శింప నితఁ డాదికవి యనియు, నితఁడు రచించిన రామాయణ మాదికావ్య మనియు నిశ్చయింపవచ్చును. ఎట్లన:-"వాల్మీకినాదశ్చ ససర్జ పద్యం జగ్రంథ యన్న చ్యవనో మహర్షి!”అని యశ్వఘోషుఁడును, “ప్రాచేతసోపజ్ఞం రామాయణమ్” అని కాళిదాసును, “ఆద్యః కవి రసి తద్భ్రూహి రామచరితమ్” అని భవభూతియును, “బభూవ వల్మీకభవః కవిః పురా” అని రాజశేఖరుఁడును, ఈరీతిగఁ దక్కినకవిసత్తము లందఱును దమతమగ్రంథములలోఁ గృత్యాదిని వాల్మీకి నాదికవి యని శ్లాఘించి యున్నారు. మఱియు—
| "శ్రుత్వా పూర్వం కావ్యబీజం దేవర్షే ర్నారదా దృషిః, | |
అనురామాయణప్రామాణ్యముచేతను,
| "ఋగ్యజుస్సామాథర్వా చ భారతం పాంచరాత్రకమ్, | |