Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యును. వైదికవృత్తములకంటెఁ బృథగ్లక్షణము గలిగి లయానుగత మగునొకనూతనవృత్తజాతి వాల్మీకి కల్పించెను. ప్రతిపాదమునందలియక్షరములలో నివి గురువు లివి లఘువు లని నిశ్చితమైన యేర్పాటు గలదీర్ఘవృత్తములజాతి యింకొకటి కాలక్రమమునఁ గలిగినది. లౌకికవృత్తముల గురులఘువర్ణానుపూర్వియు వైదికవృత్తముల గురులఘువర్ణానుపూర్వినే యనుసరించియున్నది. ఉదా—

"సహస్రశీర్షా పురుష స్సహస్రాక్ష స్సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ ద్దశాంగులమ్”

ఈదిగువ నుదహరించిన త్రిష్టుప్ఛందస్సును కొంతమార్పు చేసిన లౌకికము లగు నింద్రవజ్రోపేంద్రవజ్రావృత్తములవలెఁ జదువవచ్చును.

వైదికము

ఉదీర్ష్య నా ర్యభిజీవ లోకం
గతాసు మేత ముపశేష ఏహి
హస్తగ్రాభస్య దిధిషో స్తవేదం
పత్యు ర్జనిత్వ మభిసంబభూవ.

లౌకికము

ఉదీర్ష్వ నారీ అభిజీవ లోకం
గతాసు మేతం ఉపశేష ఏహి
హస్తగ్రభస్యా దిధిషోస్త వేదం
పత్యు ర్జనిత్వం అభిసంబభూవ.

వైదికానుష్టుప్ఛందస్సును వాల్మీకి లౌకికానుష్టుప్చందస్సునుగా నెంతసులభముగ మార్చెనో చూడుఁడు. ఇతని మార్గమునే వ్యాసాదులు ననుసరించిరి. త్రిష్టుప్ఛందోమూలకము లగువైదికదీర్ఘవృత్తము లాధునికము లగునింద్రవజ్రోపేంద్రవజ్రవృత్తములుగ మాఱెడుదశలో వ్రాయఁబడిన శ్లోకములు భారతమునఁ గానవచ్చుచున్నవి. ఇవిగాక మఱికొన్నివృత్తములు వైదికఛందోబద్ధముగనే కనఁబడుచున్నవి. ఉదా—

"ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానూ గిరా వాశంసామి తపసా హ్యనంతౌ,
దివ్యౌ సుపర్ణా వీరజౌ విమానా వధిక్షిపంతౌ భువనాని విశ్వా.
హిరణ్మయీ శకునీ సాంపరాయౌ నాసత్యదస్రౌ సునసౌ వైజయంతౌ
శుక్రం వయంతౌ తరసా సువేమా నధివ్యయంతా వసితం వివస్వతః.”

(భార. ఆది. పౌష్యపర్వ. ఆ. 3.)

బ్రహ్మ వేదములకువలె వాల్మీకి సంస్కృతశ్లోకనిర్మాణమునకును సంస్కృతకవనమునకును జనకుఁడు, కవి యనఁగా వాల్మీకి. "కవి ర్వాల్మీకిశుక్రయోః” అని విశ్వనిఘంటువు. కాళిదాసుగూడ నీయర్థమున నుపయోగించెను. “కవిః కుశలవా వేవ చకార కిల నామతః." రఘు. 14-32.

మఱియుఁ దైత్తిరీయప్రాతిశాఖ్యయందును, వాజసనేయసంహితయందును వాల్మీకినామ ముదాహరింపఁబడుటచే నితఁడు శ్రుతిప్రత్యభిజ్ఞతమాహాత్మ్యము గలవాఁ డని స్పష్టము.

(తైత్తి. ప్రాతి. 5.36; 9.4; 18. 6.)

————