Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ను వెనువెంటం బోవ గమకించి మూలంబులచేత హతగమనవేగంబులై పురజను
లకుంబోలెఁ దమకు రామానుయానభాగ్యంబు లేదయ్యె నని చింతించి వాయు
వేగంబుచేత నాక్రోశించుచున్నవానియట్ల చూపట్టుచున్న మహోన్నతంబు లైన
పాదపంబులను నాహారసంచారంబులు మాని చేష్టలు దక్కి వృక్షైకస్థాననిష్ఠి
తంబులై సర్వభూతానుకంపి వైననిన్నుఁ బ్రార్థించుచున్నఖగంబులను విలోకిం
పుమని యిట్లు బహుప్రకారంబుల దుఃఖించుచున్న యావిప్రోత్తములదీనాలాపం
బు లాలించి కల్యాణగుణాభిరాముం డైనరాముని నివారించుట కడ్డంబు
వచ్చెనో యనం దమసానది యాసన్నం బయ్యె నప్పుడు సుమంత్రుండు మార్గ
పరిశ్రాంతంబు లైనహయంబులఁ దెచ్చి యమ్మహానదీజలంబులఁ గడిగి మృదుమ
ధురఘాసంబు మేపి తద్రక్షణంబునకుం జాలియుండె నిట్లు రమ్యం బగుతమసా
తీరంబు నాశ్రయించి రాముండు సీత నవలోకించి లక్ష్మణున కి ట్లనియె.

958


క.

అనఘ రవి యస్తమించెను, వనవాసంబునకు నొక్కవాసర మయ్యెన్
మునుపటివలె నీవు మనం, బున గృహసౌఖ్యాదివాంఛఁ బొందకు మింకన్.

959


క.

పగ లెల్ల నడవిఁ గ్రుమ్మరి, ఖగమృగములు తమకు వలయు కందువలందుం
దగురీతిఁ జేరినందున, సుగుణాఢ్య వనములు గంటె శూన్యము లయ్యెన్.

960


క.

విను మిప్పు డయోధ్యాపుర, జను లందఱు బాలవృద్ధసహితంబుగ నె
మ్మనమున నడలుచు నుండుదు, రనఘా మనరాకఁ దలఁచి యంధులభంగిన్.

961


క.

అనుపమసద్గుణములచే, ననవరతము విషయవాసు లవనీపతికిన్
మనకు భరతశత్రుఘ్నుల, కనురక్తులు గారె వారి కడలు జనించెన్.

962


క.

జననీజనకులు సారెకు, వనగమనముఁ దలఁచి తలఁచి వారక మదిలో
ఘనశోకంబునఁ గుందుదు, రనఘాత్మ తదార్తి కాత్మ నడలెదఁ జుమ్మీ.

963


ఆ.

అయిన నేమి భరతుఁ డఖలధర్మవిదుండు, కరుణ జేసి యేల గావ కుండు
నతనిభక్తిభావ మరసి డెందంబునఁ, గుందకున్నవాఁడఁ గొంతధృతిని.

964


వ.

మఱియు న న్ననుసరించి వనంబునకుం జనుదెంచుటం జేసి నీ వుచితం బాచరించి
తివి వైదేహీరక్షణార్థంబునందు సహాయత సంపాదనీయంబు గదా నేఁడు
వనవాసోపక్రమదివసం బీతమసాతీరంబు మహాక్షేత్రంబు గావున నీరాత్రి
జలపానంబుఁ జేసి యిచ్చట నుపవాసంబు సేయుద మని పలికి సుమంత్రుం
జూచి నీ వశ్వరక్షణంబునం దప్రమత్తుండ వై యుండు మని నియమించిన
నతం డయ్యశ్వంబుల బంధించి సమృద్ధఘాసవంతంబులఁ గావించి ప్రత్యాస
న్నుండై సంధ్య నుపాసించి మంజుపల్లవంబులఁ దల్పంబుఁ గావించిన నారఘు
వరుండు కృతానుష్ఠానుం డై సీతాసహితంబుగా సుమంత్రవిరచితపల్లవ
తల్పంబు నధివసించెఁ బురజనంబులు మార్గాయాసఖేదంబున మై మఱచి
నిద్రించుచుండి రంత లక్ష్మణుం డన్నదిక్కుఁ గనుంగొని సూతునితో ననేక