Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఆకలుషచిత్తుఁ డంచితగుణాస్పదుఁ డైనసుతుండు కాననో
ర్వికిఁ జనియె న్మనంబు చెయిఁ బెట్టి గలంచినరీతిఁ జాలఁ ద్రి
ప్పుకొనఁ దొడంగెఁ బై పయిని మూర్ఛ ముసుం గిడుచున్న దిప్పు డం
బకములు గాన రావు ప్రసభంబున సంగము లార్తి నొందెడిన్.

900

దశరథుఁడు కౌసల్యాసదనమున కరుగుట

వ.

నీవు విధవవై పతిపుత్రపరిత్యక్తం బైనరాజ్యంబు పాలింపు మని బహుప్రకా
రంబులు విలపించుచు నచ్చోట నిలువక యపన్నాతునియట్లు నగరంబుఁ బ్రవే
శించి శూన్యచత్వరవేశ్మాంతంబును సంవృతాపణదేవతాగృహంబును గ్లాంత
దుర్భలదుఃఖార్తంబును వాత్యాకీర్ణమహాపథంబు నగుపురంబుఁ గనుంగొని
దుఃఖించుచు సూతికాగృహంబునుంబోలెఁ గశ్మలంబై యున్నయంతఃపురంబు
న కరిగి క్షోభించినమహాప్రవాహంబుచందంబున సుపర్ణహృతం బైనపన్నగంబుకై
వడి రామలక్ష్మణవైదేహీరహితం బై దిక్కఱి యున్నదాని నవలోకింపనొల్లక
దౌవారికులం జూచి కౌసల్యాసదనంబునకు నన్నుం దోడ్కొని పొం డొండు
చోట నీమనఃపరితాపంబు దీఱ దనిన వారు రయంబుగ వామదక్షిణ
పార్శ్వంబుల గ్రుచ్చి పట్టి దోడ్కొని చనిన నద్దేవిమందిరంబుఁ బ్రవేశించి
తల్పంబునం దనువు వైచి యసంవృతమేదినిం బడి పొరలుచు వడ లూనిన
చిత్తంబున భుజం బెత్తి దీర్ఘస్వరంబున రోదనంబు సేయుచుఁ బెక్కువిధం
బులఁ గుమారునిగుణంబు లగ్గించుచుఁ బుత్రవియోగసంజాతశోకానలంబునం
గాఱియపడుచుండ రాత్రిసమయం బయ్యె నారాత్రి దశరథునిపాలికిఁ గాళ
రాత్రి యై తోఁచె నప్పు డన్నరపతి కౌసల్య కి ట్లనియె.

901


మ.

అతివా రామునివెంట నంటిన మదీయాలోక మాశానుష
క్తి తదీయాకృతిపై రమించుచును దృప్తిం జెంద కీవేళకున్
ధృతిచేఁ గ్రమ్మఱ దట్లు గావున నిను న్వీక్షింపఁగాఁ జాల స
మ్మతిచే నీదుకరంబునం దనువు సంభావింపుమా యిత్తఱిన్.

902


వ.

అని నియోగించిన నద్దేవి రామగుణకథనపరవశుం డై తన్నామంబునె
పేర్కొనుచున్నదశరథుని దురవస్థఁ జూచి బహుప్రకారంబుల నాక్రందనంబు
సేయుచుఁ గన్నీరు నించుచు వేఁడి నిట్టూర్పులు పుచ్చుచు శోకభారావసన్నుం
డైనయమ్మహీపతిశరీరంబు పాణితలంబునఁ బరిమార్జించుచు ని ట్లనియె.

903


క.

వీరోత్తమ రామునిపైఁ, గూరిమి యించుకయు లేక గుబుసము వీడన్
ఘోరవిషము గ్రక్కెడు క్రూ, రోరగగతిఁ గైక గనలుచుండుం గాదే.

904

కౌసల్య పుత్రునిఁ బేర్కొని విలపించుట

ఆ.

అట్టిదానిఁ గూడి యధిప నా కేగతిఁ, బూని పొత్తు మనఁగఁ బోలు నకట
క్రూరపన్నగంబు సేరిన యింటిలో, నూహఁ జేసి మనుజు లుండ వశమె.

905