Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పలికి భవత్పాణిగ్రహంబుఁ జేసితి నింక మీఁద నిహసౌఖ్యకరంబు లైన
నీతోడిక్రీడాదివ్యవహారంబులును బరలోకసాధనంబు లైన నీతోడియగ్నిహో
త్రాదికర్మంబులును బరిత్యజింపం గలవాఁడ నని పలికి వెండియు ని ట్లనియె.

891


క.

భరతుఁడు రాజ్యస్థుం డై, చిరభక్తిని నాకుఁ బూజసేయుట కొఱకై
కర మెద్ది నొసఁగు నది నే, నరయుచు జన్మాంతరమున కయ్యెడు ననుచున్.

892

దశరథుఁడు రాముని బేర్కొని విలపించుట

వ.

మఱియు భరతుండు సామ్రాజ్యంబుఁ జేకొని సంతుష్టుం డయ్యె నేని మన్మరణా
నంతరంబున నతండు పితృప్రీత్యర్థం బెయ్యది యొసంగు నది మత్ప్రీతికొఱకుఁ
గాకుండుం గాక యని యిట్లు కైకేయి నిందించుచు రాముని పిఱుందం
బోవ నుద్యోగించిన నప్పుడు కొనల్య పతి కడ్డంబు వచ్చి మరల్చినం బ్రతిహత
గనునుం డై కామాతిశయంబున బ్రాహ్మణుం జంపినవానియట్ల కరంబునఁ
జిచ్చు నంటినవానిక్రియఁ గుమారునిం దలంచి సంతపించుచు రాహుగ్రస్తుం
డైనభానునిచందంబున దీనవదనుం డై రథమార్గంబుఁ జూచి యెలుం గెత్తి
రామునిం జేర్కొనుచు నక్కుమారుండు పురం బతిక్రమించినం జూచి శోక
వేగంబున ని ట్లని విలపించె.

893


చ.

అరదము దూర మయ్యె జవనాశ్వము లద్భుతవేగలీల బం
ధురగతిఁ బోవుచున్నయవి ధూళికతంబున నాకుమారకుం
డరసినఁ గాన రాఁడు తను వంతయు నేర్వఁ దొడంగె నింక నే
తెరువునఁ బోదు నెవ్వ రిఁక ది క్కకటా విధి నేమి సేయుదున్.

894


చ.

సరసపదార్థము ల్గుడిచి సన్నపుటొల్లియఁ గట్టి దీప్తహే
మరచితసౌధభాగముల మంజులశయ్యను బవ్వళించునా
వరసుతుఁ డాకలంబుఁ దిని వల్కముఁ దాల్చి మహీజమూలమం
దురుకఠినాశ్మతల్పమున నొ ప్పఱి యెట్లు వసించు నక్కటా.

895


తే.

ధూళివృతదేహుఁడై యొప్పు డొఱఁగి పుడమి,నుండి ప్రస్రవణంబునందుండి మదగ
జంబునట్టు లుత్థితుఁ డయి చనెడుదీర్ఘ, బాహుఁ గాంత్రు రాముని వనవాసు లెల్ల.

896


చ.

అడవిఁ జరించునప్పుడు మృగారవము ల్వినువేళ నాఁకటన్
దడఁబడువేళఁ గంటకపథంబున నేగెడువేళ నెండచే
బడలినవేళ నాకొడుకు భావమునందు ననుం దలంచి హా
యిడుమలఁ బెట్టెఁ దండ్రి యని యించుక యైనఁ దలంప కుండునే.

897


క.

జనకసుత యెంతఁ జెప్పిన, వినక మగనిఁ గూడి ఘోరవిపినంబునకుం
జనుచున్న దతిసుఖోచిత, మనమున దుఃఖించి యెంత మలఁగునొ యచటన్.

898


వ.

గంభీరంబులును రోమహర్షణంబులు నగు శ్వాపదారవంబులు విని యెంత
భయ౦పడునో యని విలపించి కైకేయిదిక్కు మొగం బై యిట్లనియె.

899