Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జంద్రుండు సౌమ్యదర్శనుండు గాకుండె సూర్యుండు తపింపకుండె మఱియుఁ
బౌరులు పుత్రమాతృభార్యాభర్తృభ్రాతలయొకఁ బరస్పరస్నేహంబు విడిచి
రామునే చింతించుచుండిరి రాముని సుహృదు లందఱు శోకభారాక్రాంతు
లై మూఢచేతస్కులై మూర్ఛిల్లి పుడమిపయిం బడి యుండికి నాగరసరిద్ద్విప
వనశైలసహితంబుగా మహి యెల్ల సంచలించె నప్పుడు.

880


క.

అనఘాత్ముఁ డైనరాముఁడు, జనకజతోఁ గూడి వనికిఁ జనియెడుతఱిఁ జే
తనములు దుఃఖంచె ననం, బని లేదు జనంబు లెల్ల మ్రాన్పడి యుండెన్.

881


క.

పొందుగ నరిగెడురాముని, స్యందనగతచక్రయుగసంజాతరజం
బెందాఁకఁ దోఁచె నురువడి, నందాక మరల్పఁ డయ్యె నధిపుఁడు చూడ్కిన్.

882


చ.

అనఘుఁడు పుత్రదర్శనమునందు మహాప్రమదంబు గల్గు నీ
మనుకులనేత కంచు గరిమం దలపోసి మహీపరాగ మా
మనుజవరేణ్యుఁ డెం దనుక మక్కువతోడ సుతు న్గుణాకరుం
గనుఁగొనుచుండె నం దనుక గాఢతరంబుగఁ బర్వె నత్తఱిన్.

883


తే.

రజము గనుపట్టునందాఁక రాజవర్యుఁ, డనఘునిఁ గుమారుఁ గనుఁగొని యంతకంత
కది యడంగిన భూరిశోకార్తుఁ డగుచు, మూర్ఛ పైకొన నంతలోఁ బుడమిఁ బడియె.

884


వ.

ఇట్లు మూర్ఛాపరవశుం డై నేలం బడి యున్ననిజవల్లభునిం జూచి కౌసల్య
దాపటను గైక వలపటం గ్రుచ్చి యెత్తి యాసీనుం గావించినం గూర్చుండి
యమ్మహీపతి శోకంబు పెంపున వ్యధితేంద్రియుం డగుచుఁ గైకేయి నవలో
కించి యి ట్లనియె.

885

దశరథుఁడు కైకేయిని దూఱుట

క.

ఓకలుషచిత్త నన్నుం, దాఁకకు నీకరము సోఁకఁ దను వంతయు న
స్తోకగతి వాఁడినూదులు, సోఁకినయ ట్లార్తి నొంది స్రుక్కెం గడిమిన్.

886


వ.

నీవదనంబుఁ జూడ నొల్ల నాకుఁ బత్నివి గావు బాంధవివి గా వని పలికి కోపం
బగ్గలం బగుటయు నంత నిలువక.

887


క.

సువిచారుఁ డైనరాముని, నవిచారత నడవి కనిపినందున వంశ
ఘ్నివి బంధుఘ్నివి భర్త, ఘ్నివి యైతివి నిన్నుఁ జూడ నేర్తునె యింకన్.

888


తే.

జగ దుపక్రోశితాచారసరణి నొంది, త్యక్తకులధర్మ వైతివి దానఁ జేసి
యాలి వని నమ్మఁజనునె నీయాననంబుఁ, గన్న ద్విజుఁ జంపినంతయఘంబు రాదె.

889


చ.

పురుషులచే ధరిత్రిపయిఁ బొల్పుగ నగ్నిసమక్షమందునం
గరము గ్రహింపఁగాఁ బడినకాంతలలోఁ బతికి న్నిరంతరం
బఱమఱు లేక ధర్మమును నర్థము కామముఁ గూడఁ బెట్టునే
ర్పరి వొక నీవె కాక కులపాంసిని వేఱొక తెందుఁ గల్గునే.

890


వ.

తొల్లి వహ్నిసమక్షంబున ధర్మార్థకామంబులయందు నీతోడఁ జరించెద నని