అంతఃపురస్త్రీలు రామవివాసనంబునుం గూర్చి విలపించుట
క. |
ది క్కెవ్వఁడు దుర్బలులకు, ది క్కెవ్వఁ డనాథులకు నధీరజనులకుం
ది క్కెవ్వఁ డట్టినాథుం, డొక్కట నేఁ డెందుఁ బోవుచున్నాఁ డకటా.
| 875
|
క. |
ఎంత యభిశప్తుఁ డైనను, బంతంబునఁ గ్రోధకరణపరివర్జితుఁ డై
సంతత మనుగ్రహమె మది, నెంతయుఁ జింతించు నాథుఁ డెం దరిగెడినో.
| 876
|
తే. |
ఏమహాత్ముఁడు తనతల్లి నెట్లు కొలుచు, న ట్లనారత మధికభక్త్యాదరముల
మనల సేవించు నట్టిక్షమాసుతాధి,వల్లభుం డెందుఁ జనుచున్నవాఁడు నేఁడు.
| 877
|
తే. |
మఱియుఁ గైకేయిచేఁ గ్లిశ్యమానుఁ డైన, యవనిపతిచేఁ బ్రచోదితుం డగుచు నెవ్వఁ
డఖలజనులకు రక్షకుం డట్టిరాముఁ, డుగ్రకాననమున కేగుచున్నవాఁడు.
| 878
|
తే. |
అకట దుఃఖాభిసంతప్తుఁ డయ్యు రాజు, సత్యధర్మవిచారుండు సర్వసముఁడు
సూరినుతుఁ డైనరాముఁడు ఘోరవనికి, నొంటిఁ బోవఁ గనుంగొనుచున్నవాఁడు.
| 879
|
వ. |
అని బహుప్రకారంబుల వివత్స లగుధేనువులచందంబున విలపించుచు రోదనం
బుఁ జేసిన ఘోరం బైననయ్యారధ్వని విని పుత్రశోకాభిసంతప్తుం డైన
మహీవరుం డినుమడిగా దుఃఖించుచుండె నప్పుడు పట్టణంబునం గలగృహమే
ధు లగువిప్రు లగ్నిహోత్రకృత్యంబులు నన్నపానాదికృత్యంబులు మఱచి ఱిచ్చ
వడి యుండిరి రామశోకకర్శితుం డైనవాఁడుపోలె సూర్యుం డస్తమించినట్లుండె
మృగాశ్వకుంజరధేనుకదంబంబులు కబళంబులకుం బాసి కన్నీరు నించుచు
వత్సంబులం గైకొనకుండె నంగారకుండును ద్రిశంకుండును బుధబృహస్పతు
లును దక్కినగ్రహంబు లన్నియు వక్రగతిచేత సోము నాక్రమించి దారుణంబు
లయి యుండె విశాఖాప్రభృతినక్షత్రంబులు దారుణగ్రహపీడితము లై పొగ
లుమియుచు మార్గంబునకుం దప్పి యుండె మేఘంబులు వాయుహతంబు లై
సముద్రంబునం బడుచుండె మఱియు సకలజంతుస్వాంతసంచారచతురుం డైన
రాముండు వనంబునకుం జనుచుండ నగరంబు బాలికానిలవేగంబున నుత్థితం
బైనసముద్రంబుభంగిఁ జలించిన ట్లయ్యె హరిదంతంబులు తిమిరసంవృతంబు
లై పర్యాకులంబు లయ్యెఁ బట్టణంబునంగల సర్వజనంబులు గుంపులు కట్టి కటకటా
యనువారును నింత పుట్టునె యనువారును నింక నేమి గల దనువారును దశ
రథుం డెంత కఠినాత్ముం డయ్యె ననువారును నింతకుం గారణంబు పాపాత్మ
యైనకైకేయి గదా యనువారును దైవంబునుం దిట్టువారును సతీసుతబంధు
మిత్రులయందు మమత్వంబు విడిచి గృహకృత్యంబులు దలంపక రాముని
మంగళగుణకీర్తనంబు సేయుచు నిరానందు లై కన్నీరు నించుచు బహుప్ర
కారంబుల విలపించువారు నై యుండిరి పవనుండు శీతలుం డై వీవకుండె
|
|