Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నకుం బోవుపగిది దుఃఖపరిత్రస్త యై రామునిరథంబు దెసకుం బాఱె నట్లు గృ
హంబు నిర్గమించి రోదనంబు సేయుచు వాతాందోళితవనలతభంగి నడలుచు
వచ్చుచున్ననమ్మహాదేవి నచ్చటివా రడ్డంబు వచ్చి మరల్చిన మరలం జాలక విల
పించుచుండె నయ్యవస్థ విలోకించి రాముండు పరమదుఃఖితుండై మరలి మరలి
చూచుచుం బోవుచుండె నప్పుడు నిలు నిలు మని పలుకు దశరథునివాక్యంబును
రథంబు రయంబునం దోలు మనియెడురామువాక్యంబును విని సుమంత్రుండు
యెద్దియుం జేయనేరక చక్రమధ్యంబునం జిక్కినపురుషునిచందంబున దశ
రథరామవచనమధ్యంబునం జిక్కి యాందోళించుచున్నం జూచి రాముండు.

867

రాముండు సుమంత్రుని రథమును వేగముగఁ దోలు మనుట

క.

బరువడిఁ దనమదిలో నిష్ఠురగతి ననుభూయమానశోకంబునకుం
జిరకాలావస్థానము, కర మిది దుస్సహ మటంచు గణుతించి తగన్.

868


వ.

సుమంత్రు నవలోకించి.

869


ఆ.

ఏను మాటి మాటి కిటు నిల్వు మనఁగ నామాట వినక వోప మంచిదగునె
యనుచు రాజు నిన్ను నాడిన రాముండు, వినఁగ నొల్లఁ డయ్యె నని వచింపు.

870


మ.

ధరణీశుం డెడఁబాయలేక మనలన్ దాక్షిణ్యవిస్ఫూర్తిచే
మరలం జీరుచు నున్నవాఁడు మనకు న్మర్యాద గా దట్టిసేఁ
త రథంబు న్వెసఁ బోవ ని మ్మనిన నాతం డట్ల కావింపఁ ద
త్తురగవ్రాతము వాయులీలఁ జనియెన్ ధూళిప్రతిచ్ఛన్న మై.

871


వ.

ఇ ట్లతిత్వరితగమనంబునం బోవుచుఁ దన్నుం గూడి వనంబునకుం బఱతెంచెద
మని ప్రార్థించుచు వచ్చువారి సామంతబాంధవమంత్రిసంఘంబుల నంతః
పురజనంబుల నుపజీవిసహస్రంబుల భృత్యులఁ బౌరజానపదజనంబుల నిలువ
నియమించిన వారందఱు బాష్పధారాపూరితముఖు లై యతనిశాసనంబు
నుల్లంఘింపం జాలక నంత నంత నిలువంబడియుఁ జిత్తవృత్తులం గ్రమ్మఱింపం
జాలక రథమార్గసక్తవీక్షణు లై యుండిరి పౌరజనంబు మరలక వెంటం బోవు
చుండె నప్పుడు పుత్రవియోగసంజాతశోకంబునం బెటలిపడుచున్నదశరథు
నవలోకించి శాస్త్రార్థకథనంబున ననూనయించుచు మంత్రిపుంగవు లి ట్లనిరి.

872


క.

జననాథ యేమి వగచెదు, తనయుఁడు దూరంబు చనియెఁ దడయక మరల
న్జనుదెంచినపుత్త్రునిఁ గని, మనమున నలరుదువు గాక మననం బేలా.

873


వ.

మఱియు నెవ్వనిపునరాగమనం బిచ్ఛయింపంబడు నతని దూరం బను
గమింపఁ జన దని యాశ్వాసించిన విని యప్పుడమిఱేఁడు ప్రస్విన్నగాత్రుం డై
విషణ్ణముఖుం డై చేయునది లేక కన్నీరు నించుచు రామరథమార్గగత
వీక్షణుం డై యుండె నంత నంతఃపురకాంతలు పరమచింతాక్రాంతస్వాంతలై
యార్తనాదంబులు సెలంగఁ దమలో ని ట్లనిరి.

874