Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నావరించుకొనియుండుఁ బతంగవృశ్చికకీటదంశమశకంబులు నిత్యంబును బాధిం
చుచుండుఁ గంటకవంతంబు లైనద్రుమంబులును గుశకాశంబులును వ్యాకుల
శాఖాగ్రంబు లై యుండు నదియునుం గాక యరణ్యవాసంబునందుఁ గాయ
క్లేశకరంబు లైనవ్రతోపవాసాదికంబులు గావించవలయు నుక్తవిలక్షణంబు
లైనభయంబు లనేకంబులు గలిగియుండుఁ గ్రోధలోభంబులు వర్జించి నిత్యం
బును దపంబునందు బుద్ధి నిలుపవలయుఁ గావున వివిధదురవస్థాప్రాప్తిహేతు
వగు కాంతారవాసంబు నీ కశక్యం బై యుండు నెల్లభంగుల మదీయవాక్యం
బంగీకరించి వనప్రయాణం బుపసంహరింపు మని నానావిధానూనవాక్యంబుల
ననూనయించుచున్న ప్రాణవల్లభుం గనుంగొని కన్నీరు నించుచు గద్గదస్వరం
బున ని ట్లనియె.

638


తే.

అనఘ మీ రాన తిచ్చినయటుల ఘోర, గహనమున దోషములు పెక్కు గలుగు టదియు
నిక్క మైనను నీదుసన్నిధివశంబు, వలన నవియు గుణంబు లై యలరుచుండు.

639


తే.

దేవ సింహాదిమృగము లదృష్టపూర్వ, మైననీవిగ్రహముఁ జూచి యధికభీతిఁ
బఱచు నెవ్వారికైనను భయము పుట్టుఁ, దవిలి భయహేతువస్తుసందర్శనమున.

640


క.

మానక మును గఱపినగురు, నానతి నీతోడ వనికి నరుగుట యెండెం
గానియెడ జీవితము లు, ర్వీనాయక విడుచు టొండె వేఱక టగునే.

641


ఉ.

మానవనాథ యింత పలుమాఱు భయం బిటు పల్క నేల నీ
మానితబాహుదుర్గములమాటున నిల్చిననన్ను వాసవుం
డై నను దేఱి చూడఁగలఁడా భవదీయపరాక్రమక్రమం
బే నిపు డాత్మలోఁ దెలియ కిట్లు దలంతునె సాహసంబునన్.

642


ఆ.

భానువంశవర్య పతిహీన యగుసాధ్వి, జగతిలోన బ్రతుకఁజాల దనుచుఁ
బెక్కుమార్లు మీరె ప్రీతితోఁ జెప్పితి, రిప్పు డన్యధర్మ మెట్లు గలిగె.

643


వ.

అదియునుం గాక.

644


క.

మును జనకునిగృహమున స, జ్జను లగుభూసురులు పరమసాధ్వీ పతితో
వనయాత్ర సలుపఁ గల వని; యనఘా వచియించి రదియు ననృతం బగునే.

645


వ.

మఱియును.

646


ఆ.

రాజవర్య సాముద్రికలక్షణజ్ఞు, లతివ పతితోడ వనమున కరుగఁగలవ
టంచు రేఖావిశేషంబు లరసి చెప్పి, రది నిరర్థక మగునె మహాత్మ యిపుడు.

647


ఆ.

వాసవాభ విప్రవరులచే నుపదిష్ట, మైనవిపినవాస మనుభవింప
కేల తక్కు నాకు హితబుద్ధి నీవెంటఁ, బూని కాననమున కేను వత్తు.

648


క.

వనవాసమందు దోసము, లసమాత్మక పెక్కు గలుగు టది నిక్కం బై